*300 కేజీల నిల్వ మాంసం నిర్వీర్యం, దుకాణం సీజ్*
*కమిషనర్ పివివిఎస్ మూర్తి*
*అపరిశుభ్రంగా నిర్వహించే రెస్టారెంట్లు, నిల్వ మాంసం విక్రయించే దుకాణాలపై నగర పాలక సంస్థ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉంటాయని,
అలాంటి దుకాణాలపట్ల వినియోగదారులైన ప్రజలు అవగాహన కలిగి ఉండాలని *నెల్లూరు కమిషనర్ పివివిఎస్ మూర్తి సూచించారు*.
స్థానిక పొదలకూరు రోడ్డు, పద్మావతి సెంటర్లోని వైన్ షాపుకు ఎదురుగా ఉన్న చికెన్ దుకాణంపై (షాపుకు పేరు లేదు) నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులను నిర్వహించి,
నిల్వ ఉంచిన 300 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న కమిషనర్ దుకాణానికి చేరుకుని మాంసపు నిల్వలను పరీక్షించారు.
అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మాంసపు దుకాణాల్లో ఫ్రీజర్లు వాడటం నిషేధం అని గుర్తించాలని,
దుకాణాల్లో ఫ్రీజర్లు కనిపిస్తే యాజమాన్యాన్ని నిలదీయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా అన్ని మాంసపు విక్రయాల దుకాణాలు, భోజన రెస్టారెంట్లపై నిఘా ఉంచామని,
ప్రజలకు ఆరోగ్యమైన ఆహారం అందేవరకు ఆకస్మిక దాడులు చేస్తూనే ఉంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ లో నూతనంగా ఒక వెటర్నరీ వైద్యుడిని నియమించుకుని క్రమం తప్పకుండా ప్రత్యేక దాడులను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
జంతు వధ శాలలలో కార్పొరేషన్ ఆమోదించి ముద్ర వేసిన మాంసాన్నే ప్రజలు కొనుగోలు చేయాలని,
అనుమానాస్పద దుకాణాల గురించి ఫిర్యాదు చేస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేసారు.
దుకాణంలో నిల్వ ఉంచిన మాంసంపై కమిషనర్ ఫినాయిల్ చల్లి, డంపింగ్ యార్డులో ఖననం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
అయితే దుకాణంపై అధికారుల దాడి జరిగిన వెంటనే ఫ్రీజర్లోని కొంత చెడిపోయిన మాంసాన్ని, యజమాని షాపు గోడపై నుంచి అవతల ఉన్న ఖాళీ స్థలంలోకి గిరాటువేసి అక్కడినుంచి చల్లగా జారుకున్నాడు.
దుకాణంలో ఉన్న ఫ్రీజర్ బాక్సులను అధికారులు జప్తు చేసుకుని, దుకాణాన్ని సీజ్ చేసారు.
ఈ ఆకస్మిక దాడుల్లో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.