నేడు హైదరాబాద్‌లో బీజేపీ చింతన్ బైఠక్
సతీశ్, రామ్‌మాధవ్ సహా 15 మంది నేతలు హాజరు
రాజధాని, పోలవరం, వలసలపై ప్రధానంగా చర్చ
వైసీపీని ఎదుర్కోవడంపై దృష్టి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్ నేతల చింతన్ బైఠక్ జరగనుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి వి.సతీశ్, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, జాతీయ కార్యదర్శులు సునీల్ దేవధర్, వైసత్యకుమార్‌తో పాటు బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, రాష్ట్ర నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరితోపాటు దాదాపు 15 మంది ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఆంధ్రలో బీజేపీని బలోవేతం చేయడం.. వైసీపీని ఎదుర్కోవడం.. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై అనుసరించాల్సిన వైఖరి మొదలైన అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. రాజధానిని మార్చడం, పోలవరంపై పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడడం సరైంది కాదని, వీటిపై నిర్దిష్టమైన వైఖరిని అవలంబించాలని పార్టీలో పలువురు నాయకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా శంకు స్థాపన చేసి నిధులు విడుదల చేసిన రాజధాని ప్రాజెక్టును కేంద్రంతో చర్చించకుండా విస్మరించడమే గాక.. తమ నిర్ణయాలకు ప్రధాని ఆశీస్సులున్నాయని చెప్పడం, దానిపై కన్నా, సుజనాచౌదరి తీవ్రంగా స్పందించడం తెలిసిందే. కేంద్రం పూర్తిగా నిధులు సమకూరుస్తున్న పోలవరం ప్రాజెక్టు టెండర్లను కూడా జగన్ ఏకపక్షంగా రద్దు చేయడంపై ఈ సందర్భంగా చర్చించే అవకాశాలున్నాయి. అసలీ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి ఆ ఘనతను మోదీ దక్కించుకోవాలని కూడా కొందరు పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్న తీరును ఎదుర్కొనేందుకు బీజేపీ సొంతంగా ముందుకురావాలని, అప్పుడే ఒక ప్రతిపక్షంగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు అంటున్నారు. దాదాపు 80 శాతంపైగా హిందువులు ఉన్న రాష్ట్రంలో మైనారిటీ లకు అనుకూలంగా తీసుకునే చర్యలను కూడా ఎండగట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలనే గాక బీసీలు, కాపులు, దళితులు, గిరిజనులను బీజేపీ వైపు తిప్పుకొనేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, ఈ వర్గాల్లోని ముఖ్య నేతలను బీజేపీకి ఆహ్వానించాలని కూడా కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీతో బీజేపీకి అవగాహన ఉందనే అభిప్రాయాన్ని జనంలో పోగొట్టాలని, పార్లమెంటులో బిల్లులపై వారు సహకరించడానికీ, పార్టీ రాజకీయాలకూ ముడిపెట్టకూడదని వారు భావిస్తున్నారు.
ఆంధ్రలో బలపడేదెలా?