చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?

తేది 17-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?


  కోడెలకు స్పీకర్‌ పదవి ఇచ్చి అవమానించారంటున్న వైసీపీ తమ్మినేనికి స్పీకర్‌ పదవినిచ్చి ఆయన్ని కూడా అవమానించిందా?


ఫర్నీచర్‌ కేసుని సాకుగా చూపి, రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు కోడెలను వేధింపులకు గురిచేసి చంపేశారు.


                                            - డొక్కా మాణిక్యవరప్రసాద్‌  


        చనిపోయాక కూడా స్వర్గీయనేత కోడెల శివప్రసాదరావుకి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారం చేయడం, ఆయన కుటుంబంపై బురదజల్లాలని చూడటం అత్యంత బాధాకరమని   తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌  ఆవేదన వ్యక్తం చేశారు.


మంగళవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  టీడీపీ అధినేత చంద్రబాబు, కోడెలకు స్పీకర్‌ పదవి ఇచ్చి అవమానించారంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను డొక్కా ఖండించారు. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారామ్‌కు కూడా వైసీపీ ప్రభుత్వం స్పీకర్‌ పదవి ఇచ్చిందని, అలాగైతే ఆయన్ని కూడా మీ ప్రభుత్వం అవమానించినట్లేనా అని మాణిక్యవరప్రసాద్‌, నానీని ప్రశ్నించారు. స్పీకర్‌ పదవి చాలా ఔన్నత్యమైనదనే విషయాన్ని మంత్రి నాని తెలుసుకోవాలన్నారు.


కోడెల శివప్రసాదరావుగారు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక చనిపోలేదన్న డొక్కా, ఆయన జీవితమే పోరాటంగా బతికారని గుర్తుచేశారు. ఇప్పటికైనా చనిపోయిన తన తండ్రిని గురించి మంచిమాటలు మాట్లాడాలని కోడెల కుమార్తె కన్నీళ్లతో వేడుకుంటున్నా, వైసీపీ నేతల మనసు కరగకపోవడం అత్యంతదారుణమని డొక్కా వ్యాఖ్యానించారు.


వైసీపీ నేతలు, మంత్రులు కోడెలపై, ఆయన కుటుంబంపై, తెలుగుదేశంపై బురదజల్లేలా మాట్లాడటం మానుకోవాలన్నారు. కోడెల తన రాజకీయజీవితంలో అనేక తప్పుడుకేసులను ఎదుర్కొన్నారన్న డొక్కా, కేవలం ప్రభుత్వం అక్రమంగా బనాయించిన ఫర్నీచర్‌ కేసు విషయంలోనే  తీవ్ర మానసిక ఆందోళనకు గురికావడం జరిగిందని డొక్కా చెప్పారు. తన రాజకీయం జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చవిచూసి, పల్నాడు అభివృద్ధికి విశేషకృషి చేసిన వ్యక్తిని కక్షసాధింపులకు గురిచేసి, ఫర్నీచర్‌ కేసుతో కోడెలను రాజకీయంగా బజారుకీడ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా అని డొక్కా నిలదీశారు. కేవలం రూ.లక్షో, రెండులక్షలో అయ్యే ఫర్నీచర్‌ కోసం వైసీపీ ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఎంతలా ఆయన్ని మానసిక క్షోభకు గురిచేసిందో రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసునని డొక్కా తెలిపారు. కేబినెట్‌ ర్యాంక్‌లో ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వాలు కల్పించే సౌకర్యాల విషయంలో ఇటువంటి ఫర్నీచర్‌లు, వస్తువులు ఉండటం చాలా సహజమని చెప్పిన మాణిక్యవరప్రసాద్‌, కోడెల కూడా తన కార్యాలయానికి వచ్చిన ఫర్నీచర్‌కు తగినరుసుము చెల్లిస్తానని చెప్పడం జరిగిందన్నారు. ఐదేళ్లక్రితం కొన్న ఫర్నీచర్‌ను కోడెల దొంగిలించాడని, దుష్ప్రచారం చేసిన ప్రభుత్వం, సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేసి,  ఆయన్ని చిత్రహింసలకు గురిచేసిన మాట వాస్తవం కాదా అని డొక్కా ప్రశ్నించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసి, స్పీకర్‌గా ఉత్తమసేవలందించిన వ్యక్తిపై దొంగతనం కేసు మోపడం అత్యంత హేయమన్నారు. కోడెలగారికి చంద్రబాబు గారు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పడం కూడా వైసీపీ దుష్ప్రచారంలో భాగమేనన్నారు. సర్గీయ నేతపై, ఆయన కుటుంబంపై ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రులు, వైసీపీ నేతలు విషప్రచారం చేయడం మానుకోవాలని డొక్కా హితవు పలికారు. కోడెల సొంతూరు కండ్లకుంట, సత్తైనపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టే, ఆయనే సత్తైనపల్లి నుంచి పోటీచేశారని, ఈ విషయం కూడా తెలియకుండా వైసీపీమంత్రి మతిలేకుండా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు డొక్కా స్పష్టం చేశారు.  


--