ముందే బాధితుల విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు  

తేది. 13-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


 టీడీపీ 'ఛలో ఆత్మకూరు' పిలుపు ఇవ్వకముందే బాధితుల విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు  


- వైసీపీ ప్రభుత్వ దహనకాండకు బలైన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది.


వైసీపీ దురాగతాలకు బలైనవారికోసం శిబిరం ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి జరిగింది.


        - శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు


 'రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలు, టీడీపీకి ఓటేసినవారిపై జరుగుతున్న దాడులు, వారికి సంబంధించిన ఆస్తుల విధ్వంసాలు, ఇతరేతర దుర్ఘటనలను వెంటనే నిరోధించాలని, ఆత్మకూరు సహా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం నాయకులు శుక్రవారం రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు.'


  ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తెలుగుదేశం చేపట్టే వరకు వైసీపీ బాధితుల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం గానీ, పోలీస్‌ యంత్రాంగం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందని మాజీ మంత్రివర్యులు, టీడీపీ శాసనసభాపక్షనేత కింజరాపు అచ్చెన్నాయుడు నిలదీశారు. శుక్రవారం విజయవాడలో డీజీపీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులపై జరుగుతున్న దాడులు, చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుని ఏకరువు పెట్టారు. సాధారణంగా వరదలు , తుఫాన్లు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు బాధితుల సంరక్షణార్ధం పునారావాస శిబిరాలు ఏర్పాటు చేస్తుంటామన్న ఆయన, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు,  ఆ పార్టీకి ఓట్లేసిన వారే లక్ష్యంగా జరుగుతున్న దాడులవల్ల సర్వం కోల్పోయిన వారికోసం దేశంలోనే తొలిసారి పునరావాస శిబిరం ఏర్పాటు చేయాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వైసీపీ దహనకాండకు బలైన వారికోసం, టీడీపీ శిబిరం పెట్టాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, అంతకుముందు గ్రామస్థాయిలో, మరీముఖ్యంగా పల్నాడులో జరుగుతున్న దాడులు, ఇతర సంఘటనల గురించి పోలీసులకు, అధికారులకు ఎన్నిసార్లు తెలియచేసినా వారినుంచి స్పందన ఏ విధమైన స్పందన లేనందునే 'ఛలో ఆత్మకూరు' కి పిలుపివ్వడం జరిగిందని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. వైసీపీ బాధితులకు న్యాయం చేయాలనే శిబిరం ఏర్పాటు చేశామన్న ఆయన, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో గత వంద రోజుల్లో వేలాది కుటుంబాలు రోడ్డునపడిన విషయం ఖాకీలకు తెలియదా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. గొడవలు చేయడానికో, రెచ్చగొట్టడానికో తమ పార్టీ 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం  చేపట్టలేదన్న ఆయన, ప్రభుత్వం బాధితుల విషయంలో ముందే ఎందుకు స్పందించలేదన్నారు.   బాధితులను హడావుడిగా గ్రామాలకు తరలించిన పోలీసులు, వారికి సరైన భరోసా కల్పించలేక పోతున్నారని, గ్రామాల్లో వదిలేయడమే మాపని, అక్కడేం జరిగినా మాకుసంబంధం లేదని పోలీసులే చెబితే ఇక వైసీపీ బాధితులకు ఎక్కడ రక్షణ ఉంటుందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశామన్న ఆయన, పోలీస్‌బాస్‌ను కలవాలని తాము నిర్ణయం తీసుకున్నాకే, నెల్లూరు అనంతపురం జిల్లాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులకు పాల్పడిందన్నారు. రాష్ట్ర పోలీస్‌ పెద్దగా డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ పోలీసులకు  సరైన విధంగా ఆదేశివ్వాలని, గ్రామస్థాయిలో టీడీపీ శ్రేణులపైనే గాక, ఇతరేతర వర్గాలపై ఎటువంటి దాడులు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని అచ్చెన్నాయుడు సూచించారు. చట్టం ముందు అందరూ సమానులేననే విషయాన్ని గుర్తించి, పక్షపాతం లేకుండా, న్యాయబద్ధంగా పోలీసులు విధులు నిర్వర్తించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫ్యాక్షన్‌ పాలన గురంచి, నూతన ప్రభుత్వం వచ్చాక ఈ వందరోజుల్లో  రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని దాష్టీకాలను పుస్తకాలరూపంలో డీజీపీకి అందించినట్లు టీడీపీ సీనియర్‌ నేత తెలిపారు. మాపార్టీ అధినేత ఆదేశాలను గౌరవించి 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్న ఆయన, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వినతులు, విజ్ఞప్తులపై డీజీపీ స్పందించకున్నా, రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులను నిలువరించకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించి బాధితులను ఆదుకునే విషయంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టంచేశారు.


 ప్రజాస్వామ్యమా....ఫాసిస్టు రాజ్యమా...!


రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమో, ఫాసిస్టు రాజ్యమో తెలియడం లేదని, బాధ్యతాయుతంగా  విధులు నిర్వర్తిస్తున్న ప్రసారమాధ్యమాలపై, పత్రికా సంస్థలపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సహేతుకమో ప్రభుత్వమే ఆలోచించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్రంలో కొన్ని ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం కేబుల్‌ ఆపరేటర్లకు ఆదేశాలివ్వడంపై ఆయన  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పౌరుడిగా తనకు నచ్చిన ఛానల్‌ చూసే అధికారం తనకు ఉందన్న ఆయన, ఆ విధమైన స్వేచ్ఛను హరించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని  అచ్చెన్న ప్రశ్నించారు. ప్రసారమాధ్యమాలపై ఆంక్షలు విధించేలా, మీడియాకు సంకెళ్లు వేసేలా  వ్యవహరిస్తున్న ప్రభుత్వం, తన తీరుని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. మీడియా సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై, ఉచితంగా వచ్చే 70 ఛానళ్ల ప్రసారాలను నిలుపుదల చేయడంపై ఒక సామాన్యుడిగా ట్రాయ్‌కు ఫిర్యాదు చేస్తామని కింజరాపు హెచ్చరించారు. 


 


 డీజీపీని కలిసిన వారిలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, కే.ఎస్‌ జవహర్‌, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పోతుల సునీత, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, దువ్వారపు రామారావు, బుద్దా నాగజగదీశ్‌, ఏ.ఎస్‌.రామకృష్ణ, ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, గద్దె రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు  బొండా ఉమామహేశ్వరరావు, జీవీ ఆంజనేయులు, తంగిరాల సౌమ్య, యరపతినేని శ్రీనివాసరావు, నేతలు మహమ్మద్‌ నసీర్‌, గద్దె అనురాధ, పట్టాభి, గురుమూర్తి, గుంటుపల్లి నాగేశ్వరరావు, దారపనేని నరేంద్ర తదితరులు ఉన్నారు.