శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో  వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2019


శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో  వైభవంగా పవిత్ర సమర్పణ


            తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.


            ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ప‌విత్రోత్స‌వాల‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. అర్చ‌క‌స్వాములు ఈ రోజు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించార‌ని, శ‌నివారం మ‌హాపూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయ‌ని వివ‌రించారు. ప‌విత్రోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు కృషి చేసిన అర్చ‌క‌స్వాముల‌కు, అధికారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.


           రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, అభిషేకం చేపట్టారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ, నివేదన, యాగశాలలో తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కారణంగా అభిషేకానంత‌ర ద‌ర్శ‌నం, బ్రేక్ ద‌ర్శ‌నం(ఉద‌యం), ల‌క్ష్మీపూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి.


             ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మల్లీశ్వరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.


సెప్టెంబరు 14న చక్రస్నానం :


              పవిత్రోత్సవాల్లో భాగంగా శ‌నివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది. ఉదయం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.