సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
10 లక్షల మంది వస్తారని అంచనా
మూడు షిఫ్ట్‌ల్లో ఉద్యోగుల సేవలు
ఏడు జోన్లుగా పారిశుధ్య పర్యవేక్షణ
24 గంటలూ అందుబాటులో
11 ప్రాంతాలలో పార్కింగ్‌
రొట్టెల పండుగ ఏర్పాట్లపై కమిషనర్‌ మూర్తి
నెల్లూరు  : నెల్లూరులో ప్రతిష్ఠాత్మకంగా జరిగే రొట్టెల పండుగకు సుమారు 10 లక్షల మంది భక్తులు హజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి తెలిపారు.  దర్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అనంతరం  వివరాలు వెల్లడించారు. 14వ తేదీ వరకు సాగే పండుగలో రొట్టెలను పట్టుకునేందుకు దేశవిదేశాల నుంచి యాత్రికులు వస్తారని, మత సామరస్యానికి ప్రతీక అయినా ఇలాంటి పండుగ మరెక్కడా లేదన్నారు. 
షిఫ్ట్‌కు 300 మంది ఉద్యోగులు : భక్తులకు సేవలు అందించేందుకు కార్పొరేషన్‌ తరపున మూడు షిఫ్టుల్లో అధికారులు, సిబ్బందిని కేటాయించామని కమిషనర్‌ చెప్పారు. షిఫ్ట్‌కు 300 మంది చొప్పున వీరంతా 24 గంటలూ అందుబాటులో ఉంటారని, ప్రతి షిఫ్ట్‌కు డ్రస్‌ కోడ్‌ కూడా విడివిడిగా డిజైన్‌ చేశామని తెలిపారు. అలాగే తాగునీటి కోసం స్టాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. దర్గా ప్రాంతాన్ని ఏడు జోన్లుగా విభజించి పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. కాగితం కింద పడినా వెంటనే ఏరివేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అలాగే 240 శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులో ఉంటాయని వాటికి రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఆ నీళ్లు ఫినాయిల్‌తో కలిసి సరఫరా అవుతాయని చెప్పారు. పుష్కరాల తరహాలో ఏర్పాట్లు చేశామన్నారు. స్నానాలు చేసే స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వసతులు కల్పించామన్నారు. స్వర్ణాల చెరువులో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు బ్లీచింగ్‌ చేయడమేకాక, మోటార్లతో ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మున్సిపల్‌ కమిషనర్లతో పర్యవేక్షణ : రొట్టెలు పట్టుకునే ఘాట్‌ వద్ద పర్యవేక్షణ బాధ్యతను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు కేటాయించినట్లు తెలిపారు. ప్రతీ 60 - 80 మీటర్లకు ఒక కమిషనర్‌ ఘాట్‌ను పర్యవేక్షిస్తూ పారిశుధ్యం, తాగునీరు, ఇతర సౌకర్యాలపై ఆరా తీస్తుంటారని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా వెంటనే తెలిసేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఉండే నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
11 ప్రాంతాల్లో పార్కింగ్‌ : నగరంలోకి ప్రవేశించే రొట్టెల పండుగ భక్తులు తమ వాహనాలను నిలుపుకునేందుకు 11 చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. ఇరగాళమ్మ గుడి వద్ద, వీఆర్సీ, టీబీ ఆసుపత్రి మైదానాలు, కస్తూరిదేవి గార్డెన్స్‌, ఎన్‌ఎంసీ కార్యాలయం ఎదురుగా తదితర ప్రాంతాలలో వాహనాలు నిలుపుకునేందుకు సౌకర్యాలు సమకూర్చామన్నారు. అక్కడ మొబైల్‌ మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర శాఖల సమన్వయంతో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.