జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు నియామకం

11.09.2019
అమరావతి


జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు నియామకం
హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో సంప్రదింపులు, సిఫార్సు తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు
రూ.100 కోట్లు, ఆ పైబడ్డ ప్రతి టెండర్‌ జ్యుడిషియల్‌ ప్రివ్యూ పరిధిలోకి 
ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చట్టం
ఇవాళ జడ్జిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
దేశంలోనే అత్యుత్తమ పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ 


అమరావతి: అత్యుత్తమ పారదర్శక విధానం దిశగా కీలక అడుగుç పడింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం మేరకు తీసుకు వచ్చిన ముందస్తు న్యాయ సమీక్ష చట్టం అమలుకు సర్వం సిద్ధమవుతోంది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి. శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ శివశంకరరావు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 


ప్రభుత్వ టెండర్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారదర్శక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రమాణ స్వీకారం రోజునే దీనిపై ప్రకటన చేశారు. తన పాలనలో సుపరిపాలన పారదర్శకత కోసం చట్టాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత ప్రక్రియ కోసం జడ్జిని కూడా సూచించాలంటూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు నివేదించారు. దీంట్లో భాగంగా గడచిన అసెంబ్లీ సమావేశాల్లో జులై 26, 2019న బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన 25 రకాల పనులు ముందస్తు న్యాయ పరిశీలన  ద్వారా పారదర్శకత చట్టం పరిధిలోకి వస్తాయి. చరిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకు వచ్చామని, చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటిది జరగలేదని, ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఇది మొదలవుతుందని ఆరోజు శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ అన్నారు. పారదర్శకత అనే పదానికి ఇక్కడ నుంచే అర్థం మొదలైతే, దేశం మొత్తం దీన్ని అనుకరిస్తుందని సీఎం ఆరోజు తన ప్రసంగంలో పేర్కొన్నారు. అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చట్టం తీసుకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. 


జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఇలా...:
ఏ టెండర్‌ లేదా పని విలువ రూ.100 కోట్లు, ఆపై దాటితే టెండర్‌ పత్రాలు న్యాయమూర్తి పరిశీలనకు
ఏడు రోజులపాటు ప్రజా బాహుళ్యంలోకి టెండర్‌ పత్రాలు, సలహాలు, సూచనలు స్వీకరణ
తోడుగా ఉండే టెక్నికల్‌ టీం నుంచి జడ్జి సలహాలు, సూచనలు, వివరాలు పొందవచ్చు. 8 రోజుల పాటు ఈ పరిశీలన జరుగుతుంది. సంబంధిత శాఖాధికారులను పిలిపించి టెండర్లలో మార్పులు, చేర్పులు సూచించవచ్చు.
మొత్తం 15 రోజులు ఈ ప్రక్రియ ఉంటుంది. 
న్యాయమూర్తి సూచనలను తప్పనిసరిగా అమలు చేస్తూ ఆ తర్వాత టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.


ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్‌ విధానం ఉంటుంది.