కేఆర్ పురం ఐటీడీఏలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా

కేఆర్ పురం ఐటీడీఏలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా                                                                             విజయవాడ : గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పాఠశాలల్లో సౌకర్యాల వంటి కార్యక్రమాలను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని కే.ఆర్ పురం ఐటీడీఏలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా  రంజిత్ బాషా పలు గ్రామాల్లో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికారులను ఆరా తీయడం జరిగింది. తొలుత జంగారెడ్డి గూడెంలోని గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ ను ఆయన సందర్శించారు. అక్కడ వసతి, వంటగదిని పరిశీలించారు. హాస్టల్ లో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాల్సిందిగా పీవోను ఆదేశించారు. అనంతరం బుసరాజుపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకులం మరియు బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
తన పర్యటనలో భాగంగా రంజిత్ బాషా కే.ఆర్ పురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. శిక్షణ అందుతున్న విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న శిక్షణ, సౌకర్యాలపై రంజిత్ బాషా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్న జూట్ బ్యాగుల తయారీ, వెదురు ఉత్పత్తులు, బిస్కెట్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిందిగా పీవోను ఆదేశించారు. అనంతరం కే.ఆర్ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత నూతిరామన్న పాలెంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, కే. బొట్టప్ప గూడెంలోని ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించి సిబ్బంది కొరతపై చర్చించారు. త్వరలోనే అసవరమైన సిబ్బందిని నియమించి విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తామని శ్రీ. P. రంజిత్ బాషా హామీ ఇచ్చారు. పర్యటనలో కే.ఆర్ పురం ఐటీడీఏ పీవో  సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.