కోడెల ఆత్మహత్య: చంద్రబాబుపై కొడాలి సంచలన వ్యాఖ్యలు

కోడెల ఆత్మహత్య: చంద్రబాబుపై కొడాలి సంచలన వ్యాఖ్యలు
అమరావతి : టీడీపీ కీలకనేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య గురించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా మీట్ నిర్వహించిన నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. కోడెల ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
తీవ్ర మనస్తాపం చెంది : 'కోడెలకు ఇబ్బందులెదురైతే చంద్రబాబు పట్టించుకోలేదు. వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబుకు కోడెల సహకరించారు. చంద్రబాబుకు ఇంత చేసినా తనను పట్టించుకోలేదని కోడెల మనస్తాపం చెందారు. ఆలపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చి కోడెలను చంద్రబాబు పక్కనపెట్టారు. కోడెలకు నర్సరావుపేట సీటు ఇవ్వకుండా సత్తెనపల్లినుంచి పోటీ చేయించారు. కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌ను చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ తీసుకెళ్లి వాడుకున్నట్టు స్వయంగా కోడెల ప్రకటించారు. వైసీపీ బాధితుల క్యాంపునకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఆందోళనకు పల్నాటి పులిని ఎందుకు అనుమతించలేదు' అని ఈ సందర్భంగా చంద్రబాబుపై నాని ప్రశ్నల వర్షం కురిపించారు.