అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులకు ఈ- టెండర్లు

అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులకు ఈ- టెండర్లు
- విద్యాధరపురం-50, గన్నవరం-50.. అమరావ తికి-50 బస్సులు
- ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లలో నడపటానికి అనుమతులు
- విలీన వేళ.. అద్దె విధానం మంచిది కాదంటున్న కార్మికులు
విజయవాడ : అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) టెండర్లను పిలవటంతో ఆ సంస్థ ఉద్యోగ, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 350 ఎలక్ర్టిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఈ-టెండర్లు పిలిచారు. కృష్ణా రీజియన్‌కు సంబంధించి విజయవాడ సిటీ డివిజన్‌ నుంచి మొత్తం 150 ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం టెండర్లను పిలిచింది. సంస్థలో అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకోవాలన్న ఆలోచనతో పాటు ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లను గుత్తంగా ప్రైవేటు బల్క్ ఆపరేటర్ల చేతుల్లో పెట్టడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన వేళ.. ఎలక్ర్టిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలనుకోవడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 350 ఎలక్ర్టిక్‌ బస్సులను ఐదు లాట్లగా అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఈ-టెండర్లు పిలిచారు. కృష్ణా రీజియన్‌కు సంబంధించి విజయవాడ సిటీ డివిజన్‌ నుంచి మొత్తం 150 ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేందుకు రెండు లాట్లలో ఆర్టీసీ యాజమాన్యం టెండర్లను పిలిచింది. విజయవాడ నగరంలో విద్యాధరపురం బస్‌ డిపో నుంచి ఒక లాట్‌గా 50 బస్సులు, గన్నవరం బస్‌ డిపో నుంచి రెండవ లాట్‌గా 50 బస్సులు వెరసి అమరావతి రాజధానిలో నడి పేందుకు మరో 50 బస్సులకు టెండర్లు పిలిచారు. ఆర్టీసీ యాజమాన్య చర్యకు గుర్తింపు సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) అభ్యంతరం తెలిపింది. ఎలక్ర్టిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవటంతో పాటు, షెడ్యూల్‌ రూట్లను ప్రైవేటుబల్క్‌ అపరేటర్ల చేతుల్లో పెట్టడం సంస్థను నిర్వీర్యం చేయటమేనన్న భావనను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న చర్య రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని భవిష్యత్తులో ప్రైవేటీకరణ దిశగా నడిపించటమేనని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీని విస్తరించాలంటే నేరుగా సంస్థకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలి తప్పితే.. అద్దెకు బస్సులను తీసుకుని నిర్వహణను వారి చేతిలో పెట్టడం సబబు కాదని మండిపడుతున్నారు. ఆర్టీసీ అధికారులు టెండర్లను ఆహ్వానించటంతో పాటు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ని కూడా విడుదల చేశారు. ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం చూస్తే విద్యుత్‌ బస్సులను 12 సంవత్సరాల కాలానికి తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌ స్కీమ్‌ -2లో భాగంగా కాంట్రాక్టు పద్ధతిన బస్సులను తీసుకుంటామని ప్రకటించింది. బస్సు ప్రయాణించే దూరం ప్రాతిపదికన కిలో మీటర్‌కు నిర్ణయించిన ప్రకారం చెల్లింపు జరుగుతుందని పేర్కొంది. బస్సులను ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లలో నడపటానికి అవకాశం కల్పిస్తుంది. టెండర్లలో కార్పొరేట్‌ సంస్థలు పాలుపంచుకునే అవకాశం ఉంది. ఈ టెండర్‌ను దక్కిం చుకునేందుకు కార్పొరేట్‌ సంస్థల మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
కొత్త ఉద్యోగుల రాక కష్టమే : కార్మిక సంఘాలు సంస్థలో అద్దె బస్సులను తీసుకోవటాన్ని ఏనాడూ అంగీకరించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం చెబితే కార్మికులు సంతోషించారు. ఈ దశలో అద్దె ప్రాతిపదికన బస్సులను తీసుకోవటానికి ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న చర్యలు అంతే స్థాయిలో కార్మికులను ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినా.. ప్రస్తుత అద్దె విధానాలను చూస్తే భవిష్యత్తులో సంస్థలోకి కొత్తగా ఉద్యోగులను తీసుకోవటానికి ఇక అవకాశాలు ఉండవని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గుర్తింపు సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) నేతలు పి.దామోదరరావు, వైవీ రావులు తక్షణం అద్దె ప్రాతిపదికన పిలిచే టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
ఎలక్ర్టికల్‌ బస్సులను ప్రవేశపెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, ఈ ముసుగులో కార్పొరేట్‌ సంస్థలకు ఆర్టీసీని పంచే పద్ధతిని అంగీకరించబోమని చెబుతున్నారు. ఆర్‌ఎఫ్‌పీలో డ్రైవర్‌తో కలిపి, డ్రైవర్‌ లేకుండానూ అన్న ఆప్షన్‌ను ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. దీని ప్రకారం చూస్తే.. సంస్థలు డ్రైవర్‌ను కూడా తామే నియమించుకునే పరిస్థితులు ఉంటాయి. కండక్టర్లను కూడా తామే నియ మించుకుంటామని బల్క్‌ సప్లయిర్‌ ప్రతిపాదించే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ అంతా పూర్తిగా ప్రై వేటు బల్క్‌ ఆపరేటర్‌ చేతుల్లోనే ఉంటుంది.
ఎవరికి లాభం : సంస్థలోకి అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకోవటం ఆర్టీసీకి అంతగా ప్రయోజనకరంగా ఉండదు. అద్దెకు కాబట్టి ఆదాయం ఎక్కువుగా ఆపరేటర్‌కే వెళుతుంది. ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లను ఇవ్వటం వల్ల ఈ రూపేణా ఆర్టీసీ ఆదాయానికి గండి పడే అవకాశాలు ఉంటాయి. ఈ ఎలక్ర్టికల్‌ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తే సంస్థకు అధిక ప్రయోజనం కలుగుతుంది. డీజిల్‌ ధర కలిసి వస్తుంది. పూర్తి ఆదాయం సంస్థకు చెందుతుంది. మధ్యలో కార్పొరేట్‌ శక్తులు ప్రతిఫలాన్ని పొందటానికి అవకాశం ఉండదు.