సచివాలయాలు @ 237 సేవలు 

సచివాలయాలు @ 237 సేవలు
ప్రజలకు సచివాలయాల ద్వారా భారీగా సేవలు
72 గంటల్లో అందించే సేవలు 115
సంక్షేమ పథకాల అమలు ప్రణాళికపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 
సాంకేతిక కారణంతో ఏ పథకాన్నీ నిరాకరించరాదు
అమరావతి:  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ఇందులో 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందించగలమో వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలు, సంక్షేమ పథకాల అమలు ప్రణాళికపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిగామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లకు ఉద్దేశించిన కాల్‌ సెంటర్‌లలో ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నామని.. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్‌ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్‌ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. 


మౌలిక వసతులపై ఆరా..: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులను సమకూర్చారా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల జాబ్‌ చార్టులను అడిగి తెలుసుకున్నారు. 72 గంటల్లోగా సమస్యను పరిష్కరించడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ కూడా ఉండాలని, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్, సంబంధిత శాఖ కార్యదర్శి.. ఇలా అందరితో అనుసంధానం ఉండాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ చాలా ముఖ్యమైనదని, నాలుగు లక్షల మందితో పని చేయించుకోవడం చాలా ప్రాధాన్యత ఉన్న అంశంగా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యవస్థ కోసం మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇళ్ల స్థలాలపై వలంటీర్ల సర్వే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలని సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఒకే నమూనాలో ఉండేలా చూడాలని సీఎం కోరారు.  రైతులకు వర్క్‌షాప్‌ల నిర్వహణ, నాణ్యమైన ఎరువులు, విత్తనాల కోసం ఒక షాపు కూడా ఉండాలని సూచించారు.  ఏ పథకాన్ని కూడా సాంకేతిక కారణాలతో నిరాకరించరాదని చెప్పారు.