సీఎం చెబితే మమ్మల్ని చంపేస్తారా?: చంద్రబాబు

సీఎం చెబితే మమ్మల్ని చంపేస్తారా?: చంద్రబాబు
గుంటూరు : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం నాడు గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్ సర్కార్‌ తీరును ఎండగట్టారు. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా? అంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ చట్ట వ్యతిరేక పార్టీ కాదని.. పోలీసులకు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికి పది మందిని చంపారని.. పలువురిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ బాధితులు స్వగ్రామంలో నివసించే హక్కు కోసం 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చామని ఈ సందర్భంగా బాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌, రౌడీయిజాన్ని కంట్రోల్‌ చేశామన్నారు.
మీ ప్రతాపం అంతా మాపై చూపిస్తారా? : 'వైసీపీ బాధితుల క్యాంప్‌ పెట్టి 8 రోజులైనా మీకు కనిపించలేదా?. ఇప్పుడు వచ్చి బాధితుల్ని తీసుకెళ్తామంటారా?. వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తారో చెప్పాల. టీడీపీ చట్ట వ్యతిరేక పార్టీ కాదు.. పోలీసులకు ఎందుకు ఇంత బేషజాలు. సమాధానం చెప్పమంటే కౌంటర్‌ ప్రోగ్రామ్‌ ఇస్తారా?. మీ బాబాయ్‌ని చంపినవాళ్లను ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదు?. పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీ ప్రతాపం అంతా మాపై చూపిస్తారా?. వైసీపీ చలో ఆత్మకూరు అనడం హాస్యాస్పందం. ఇది పైశాచిక, రాక్షస ఆనందం తప్ప మరోకటి కాదు. హోంమంత్రి, పోలీసులు పద్ధతిగా వ్యవహరించాలి' అని ఈ సందర్భంగా బాబు సూచించారు.
144 సెక్షన్‌ పెడతారా? : 'హోంమంత్రి నియోజకవర్గంలోనే గోడ కడతారా?. గోడ తీయించాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా?. రక్షణ కోసం వస్తే రాక్షసత్వంగా ప్రశ్నిస్తారా?. బీజేపీ నాయకులు వస్తుంటే 144 సెక్షన్‌ పెడతారా?. వైసీపీ నాయకులకు 144 సెక్షన్‌ వర్తించదా?. సేవ్‌ పల్నాడు పేరుతో సీఎం, హోంమంత్రి ఫొటోలు పెట్టుకుంటారా..?. మీది ఊరేగింపు.. మాది బాధితుల గోడు. బాధితుల గోడు వినే నాథుడే లేడు. సీమలో చీని చెట్లు నరికి టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారా?. రాజానగరం ఎమ్మెల్యే కబ్జాను అడ్డుకున్నందుకు దాడి చేశారు' అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.