జగన్‌వి అన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలే: కన్నా

జగన్‌వి అన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలే: కన్నా
అమరావతి : సహకార రంగంలో ఎన్నికలు జరిపే ధైర్యం కూడా లేకపోయిందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఎందుకు రిజర్వేషన్లు పాటించలేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌వి అన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలేనని విమర్శించారు. జగన్‌ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. చాలా త్వరగా పరిపాలనపై జగన్‌ పట్టు కోల్పోయారని కన్నా విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు మూలన పడే పరిస్థితి రావడానికి కారణం.. మీ నిర్ణయాలు కాదా? అని నిలదీశారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారిచ్చారని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని కన్నా విమర్శించారు. వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదన్నారు. అవినీతిపరులను వదిలేసి రేషన్‌ డీలర్లు, తాత్కాలిక ఉద్యోగులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని కన్నా మండిపడ్డారు. మీరు కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువమందిని రోడ్డున పడేశారన్నారు. రోజురోజుకు అభివృద్ధి క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ 3 నెలల్లో మీ అవగాహనా రాహిత్యం ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తుందని.. మత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని కన్నా విమర్శించారు.