ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతోంది : చిత్తూరు ఎం

 


 *🌹రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతోంది : చిత్తూరు ఎం పి రెడ్డెప్ప* 


 *తిరుపతి, సెప్టెంబర్ 14:* రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతోందని చిత్తూరు ఎం పి రెడ్డెప్ప పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఎం పి మాట్లాడుతూ రుయా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.


          ఎంఎల్సి యండవల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.


          తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ దాదాపు 57 సం. ల క్రితం ప్రారంభమయిన రుయా ఆసుపత్రి రాయలసీమలోనే తలమానికమైనదని, దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిని అభివృద్ధి పరచారని, సామాన్యునికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రుయాను మరింతగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు.


          పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ్ మాట్లాడుతూ పలమనేరు లో గల 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారని కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కోరారు. పలమనేరు నియోకవర్గ పరిధిలోని పి.హెచ్.సి లలో గల డాక్టర్ ల పోస్ట్ లను భర్తీ చేయాలని మంత్రిని కోరారు.


          పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో పని చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని హాస్పిటల్ కమిటీ లను బలోపేతం చేయాలని, పీలేరు ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, వాయల్పాడు లో గల 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని పి.హెచ్.సి లలో గల సిబ్బంది కొరతను, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. 


          సత్యవేడు ఎం.ఎల్.ఏ ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం లో పి.హెచ్.సి లలో రాత్రి వేళల్లో డాక్టర్ లు మరియు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అత్యవసర సమయాలలో వైద్య సేవల కొరకు మద్రాసు మరియు తిరుపతికి వెళ్లాల్సి వస్తుందని ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.


          మదనపల్లె శాసన సభ్యులు నవాజ్ బాషా మాట్లాడుతూ మదనపల్లె ఏరియా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా చేశారని అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన చేయాలని, ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.


          తంబళ్ళపల్లె శాసన సభ్యులు ద్వారకనాథ రెడ్డి మాట్లాడుతూ తంబళ్ళపల్లె నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అత్యవసర సమయాలలో వైద్య సేవల కొరకు మదనపల్లె, తిరుపతికి వెళ్లాల్సి వస్తోందని, ఈ ప్రాంతం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.   


          నగరి శాసన సభ్యులు శ్రీమతి రోజా మాట్లాడుతూ నగరి నియోజకవర్గం లో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం ఊరికి దూరంగా ఉండడంతో పాటు డ్రైనేజ్ కాలువ నీరు మరియు చెత్త ఆసుపత్రి పరిసరాల చుట్టూ చేరడం జరుగుతోందని, ఇలా జరగడం వలన మరింత అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇందుకు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. నగరి నియోజకవర్గంలో గల పి హెచ్ సి లు, సి హెచ్ సి లలో వైద్యుల కొరత కలదని, మౌలిక వసతులను కల్పించాలని మంత్రి ని కోరారు


           మండలాలలో గల పి.హెచ్.సిలలో గల డాక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వైద్య సేవలు అందించేందుకు వాహన సౌకర్యం లేదని, సిబ్బంది కొరత కలదని, స్పెషలిస్ట్ డాక్టర్లు వారి సేవలను మెరుగు పరచుకొనే పరిస్థితి లేదని పలువురు డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  


          గౌరవ శాసన మండలి, శాసన సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరిస్తూ ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలను కేటాయించడం జరుగుతుందని, ఈ వాహనాలు పి.హెచ్.సి పరిధిలో ఉంటాయని, పారా మెడికల్ సిబ్బంది సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుందని, వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల నిమిత్తం సుజాత శర్మ కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించడం జరుగుతున్నదని అన్ని పి.హెచ్.సి లు, సి.హెచ్.సి లు ల్యాబ్ ల నిర్వహణ మరియు సిబ్బంది నియామకం, మందుల కొరత నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని, గ్రామ వాలంటీర్ల నియామకం మరియు గ్రామ సచివాలయాలలో వైద్య సిబ్బంది నియకం తో సిబ్బంది కొరత సమస్య తీరుతుందని తెలిపారు. అక్టోబర్ 10 నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


          ఈ సమీక్షా సమావేశం లో స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ, రుయా సూపరింటెండెంట్ డా.భవానీ, డి.ఎం అండ్ హెచ్ ఓ డా.రామ గిడ్డయ్య, డి సి హెచ్ సరళా దేవి, జిల్లా లోని ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, మెడికల్ ఆఫీసర్ లు, ఆయుష్ శాఖ డాక్టర్ లు, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.