నా గుండె కలచి వేసింది: పవన్‌ కళ్యాణ్‌

నా గుండె కలచి వేసింది: పవన్‌ కళ్యాణ్‌
హైదరాబాద్ : 'దళిత కులాల మీద దాడులు జరిగినా.. చెప్పడానికి భయపడుతున్నారు. మిగతా వారు.. ముఠాలు చెప్పింది మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధను వెళ్లబోసుకుంటే నా గుండె కలచి వేసింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. సోమవారం నాడు ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్‌ చేశారు. ఈ సందర్భంగా 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో మాతృభాషపై ప్రధాని వ్యాఖ్యల కథనాన్ని పోస్ట్‌ పవన్‌ చేశారు. కడప జిల్లాల్లో పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. ఇదే పుస్తకంలో 75వ పేజీలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రస్తావన కూడా ఉందన్నారు. 1996లో ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వస్తాయన్నారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారన్నారు. ఈ ముఠా సంస్కృతి వల్ల రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుందన్నారు. రాయలసీమలో మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉందని జనసేనాని చెప్పుకొచ్చారు.