జగన్‌కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ

జగన్‌కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ
అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు వల్ల లాక్‌డౌన్ నేపథ్యంలో తొలగించిన కార్డు దారులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో చౌకడిపోల వద్ద ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండా వందల సంఖ్యలో రేషన్ దార్లు క్యూలైన్లో ఉంటున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా రేషన్‌ను వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రతి కార్డుదారునికి రేషన్ ఇచ్చే తేదీ, సమయం కేటాయించి, వలంటీర్ల ద్వారా ఇంటింటికీ టోకెన్ ఇప్పించడం ద్వారా రద్దీని నివారించవచ్చని రామకృష్ణ సూచించారు. రెగ్యులర్‌గా ఇచ్చే 5 కేజీల బియ్యంతో పాటు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామన్న10 కేజీల బియ్యం కూడా అదనంగా పంపిణీ చేయాలన్నారు. బియ్యం, కందిపప్పుతోపాటు పామాయిల్, చింతపండు, పంచదార, ఉల్లిపాయల వంటి ఇతర నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలన్నారు. ఏప్రిల్ 4 న ప్రభుత్వం ఇస్తానన్న వెయ్యి రూపాయలను కుటుంబానికి రు.10 వేలకు పెంచి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.