జడ్పీ పీఠంపై... వైకాపాలో పోటీ..

జడ్పీ పీఠంపై... వైకాపాలో పోటీ..!
 ఫలితాల అనంతరం అభ్యర్థి ఖరారు                    అమరావతి: జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వానికి అధికార పార్టీ వైకాపాలో పోటీ పెరుగుతోంది. తమకు హామీ ఇచ్చారంటే.. లేదు తమకే హామీ ఇచ్చారని పలువురు అభ్యర్థినులు తెరమీదకు వస్తున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చిన తర్వాతే నామినేషన్‌ వేయాలని కొంతమంది భావిస్తున్నారు. జిల్లా పరిషత్తు ఎన్నికలకు.. బుధవారం నాటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నెల 14 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. అభ్యర్థిత్వం ఖరారైనా కాకపోయినా బుధవారం నామినేషన్‌ ఎట్టి పరిస్థితుల్లో దాఖలు చేయాల్సి ఉంది. పార్టీ నిర్ణయం మేరకు 14 నాటికి ఉపసంహరించుకుని, బరిలో ఉన్న అభ్యర్థికి పార్టీ బిఫారం అందజేయనున్నారు. అటు వైకాపాలోనూ.. ఇటు తెదేపాలోనూ దీనికి అనుగుణంగా కసరత్తు జరుగుతోంది. కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ పదవి ఈసారి జనరల్‌ మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. దీంతో దీనికి పోటీ పెరిగింది. జిల్లాలో అధికార పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. అధికార పార్టీ తరఫున తమకే టిక్కెట్‌ అంటూ పలువురు తమ అనుచరులకు స్పష్టం చేస్తున్నారు. 
మంత్రులు, ఎమ్మెల్యేలదే బాధ్యత! 
అధికార పార్టీ వైకాపాలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిని ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపిక చేయనున్నారు. పార్టీ విధాన నిర్ణయంగా చెబుతున్నారు. ముందుగా జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంతులదే కావడం విశేషం. జిల్లాలో 2019 శాసనసభ ఎన్నికల్లో వైకాపా హవా నడిచిన విషయం తెలిసిందే. మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో తెదేపా గెలుపొందింది. అయితే వాటిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి గుడ్‌బై చెప్పి వైకాపాతో కలిసి పని చేస్తున్నారు. ప్రస్తుతం గన్నవరానికి ఇన్‌ఛార్జిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో కొడాలి నాని, పేర్ని నాని కీలకంగా ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నగరపాలక సంస్థ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 53 మండలాలు ఉండగా.. అందులో 49 మండలాలు గ్రామీణం పరిధిలో ఉన్నాయి. వీటిలో 3 మండలాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 46 మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి దకర్కించుకోవడానికి 24 మంది గెలవాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల దృష్ట్యా జిల్లాలో వైకాపాలో పోటీ పెరిగింది.
*గత జడ్పీ ఎన్నికల్లో మొత్తం 49 జడ్పీటీసీ స్థానాలకు తెదేపా 34 స్థానాలు గెలుచుకొంది. తిరుగులేని ఆధిపత్యం సాధించింది. వైకాపా 15 స్థానాలను గెలుచుకుంది. మండల పరిషత్తు అధ్యక్ష పదవుల్లో తెదేపా 36 గెలుచుకుంది. వైకాపాకు 13 మాత్రమేవచ్చాయి. తెదేపా అత్యధికంగా 476 ఎంపీటీసీలను గెలుచుకుంది.
*జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో ఐదు స్థానాలను గెలిచిన వైకాపా చివరికి మూడుతోనే మిగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు (విజయవాడ పశ్చిమ, పామర్రు) తెదేపా సైకిల్‌ ఎక్కారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ మొహన్‌తో కలిపి మొత్తం 15 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. 
*మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వారి జడ్పీటీసీ స్థానాలకు, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం గత జడ్పీ పాలక వర్గంలో వైకాపా ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన తాతినేని పద్మావతి ఈసారి తనకే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో తోట్లవల్లూరు నుంచి పోటీ చేసిన ఆమె ఈసారి పామర్రు నుంచి నామినేషన్‌ వేయనున్నారు. వాస్తవానికి ఆమె సొంత మండలం పెనమలూరు.
*గన్నవరం నియోజకవర్గం నుంచి దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారు. దుట్టా వైకాపా ఇన్‌ఛార్జిగా ఉండేవారు. ఆయనను తప్పించి యార్లగడ్డ వెంకట్రావుకు టిక్కెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీ చేరికతో యార్లగడ్డకు ప్రాధాన్యం తగ్గింది. దుట్టా రామచంద్రరావు, వంశీ కలిసి పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సీతామహాలక్ష్మి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా హామీ ఇస్తే.. ఉంగటూరు నుంచి పోటీకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారంతో గడువు ముగుస్తోంది. 
పెడన నియోజకవర్గం నుంచి ఉప్పాల హారిక ఆశిస్తున్నారు. ఆమె వైకాపా నేత ఉప్పాల రాంప్రసాద్‌ కోడలు. ఉప్పాల రాము భార్య ఈ హారిక. గత ఎన్నికల్లో పెడన సీటు జోగి రమేష్‌కు ఇచ్చారు. మైలవరం నుంచి తీసుకొచ్చి ఆయనకు సీటు ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన సీటు కోసం ఉప్పాల రాంప్రసాద్‌ త్యాగం చేశారని ఆయనకు పదవి ఇస్తారని ఆశించారు. ఇటీవల డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ పదవి ఆయనకు దక్కింది. ఇటీవల సంక్రాంతి సంబరాలకు గుడివాడ వచ్చిన సీఎం జడ్పీ పీఠం ఇస్తారని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఆ మేరకు తన కోడలు ఉప్పాల హారికకు అవకాశం దక్కుతుందని జనరల్‌ మహిళ కేటగిరిలో బీసీకి సీటు ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. 
*బందరు ఎన్నిక వాయిదా పడింది. కానీ మంత్రి పేర్ని నాని తరఫున కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జడ్పీటీసీలు గెలిచిన తర్వాత మాత్రమే అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయమని చెబుతున్నారు.