రూ.1400 కోట్లు సున్నా వడ్డీ డబ్బులు విడుదల చేసిన సీఎం వైయస్‌.జగన్‌

 


*24.04.2020*
*అమరావతి*


వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం


కరోనా సంక్షోభంలో అక్కచెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం అండ
*రూ.1400 కోట్లు సున్నా వడ్డీ డబ్బులు విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*
*క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి పథకం ప్రారంభం*
*91 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం*
*అక్క చెల్లెమ్మల చేతుల్లోనే డబ్బు పూర్తిగా సద్వినియోగం*
*అందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం*
*ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు*
*పథకం ప్రారంభం సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు*
*ప్రతి పథకంలోనూ అక్క చెల్లెమ్మలకే పెద్ద పీట వేశాం*
*ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం*
*నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం ఇచ్చాం*
*అమ్మ ఒడిద్వారా బడికి పంపుతున్న పిల్లల తల్లులకు మేలు చేశాం*
*విద్యాదీవెన ద్వారా... పెద్ద చదువులు చదువుతున్న వారికీ అండగా నిలిచాం*
*ఈ డబ్బు అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం*
*ఇకపై ఫీజు రియింబర్స్‌మెంట్‌ కూడా అక్కచెల్లెమ్మల ఖాతాలోకే*
*కరోనా వల్ల ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచింది*
*నాన్నగారి పుట్టిన రోజు, జులై 8న 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ*
*ఉచితంగా ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం*
*దిశచట్టాన్ని కూడా తీసుకు వచ్చాం, మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*



అమరావతి:
 వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పథకంలోనూ అక్క చెల్లెమ్మలకే పెద్ద పీట వేస్తోందని, ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని, ఈ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక డిప్యూటీ సీఎంతో పాటు, మంత్రుల్లో ఇద్దరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒక మహిళ అని ఆయన గుర్తు చేశారు. ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. 
 తల్లులు, అక్క చెల్లెమ్మల చేతుల్లోనే డబ్బు పూర్తిగా సద్వినియోగం అవుతుందని, అందుకే కొన్ని పథకాల్లో నగదును వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. దీని వల్ల ఫలితాలు బాగుంటాయని, ప్రతి పైసా చక్కగా వినియోగం అవుతుందని పేర్కొన్నారు. అందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నామన్న సీఎం, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వెంటనే రూ.1400 కోట్లు జమ అవుతాయని చెప్పారు. ఈ పథకం అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు చేస్తుందన్న ఆయన, ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
 గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిల్చిపోయిన పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తూ.. ‘వైయస్సార్‌ సున్నా వడీ పథకం’ను ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అమరావతిలోని క్యాంప్‌ ఆఫీసులో బటన్‌ నొక్కడం ద్వారా సీఎం ఈ పథకం ప్రారంభించారు. ఆ వెంటనే 8.78 లక్షల పొదుప సంఘాల మహిళల ఖాతాల్లోకి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతలో నగదు జమ అయింది. మొత్తం 90,37,254 మహిళల ఖాతాల్లోకి రూ.1400 కోట్లు జమ చేశారు. 
 విపత్తు సమయంలోనూ మహిళలకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు, జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


మహానేత హయాంలో
 గతంలో దివంగత మహానేత వైయస్సార్‌ హయాంలో పొదుపు సం«ఘాల మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందాయని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. అంతకు ముందు పొదుపు సంఘాల మహిళలు తమ రుణాలపై రూపాయికి పైగా వడ్డీ చెల్లిస్తుండగా, మహానేత వైయస్సార్‌ తొలుత కేవలం పావలా వడ్డీకే వారికి రుణాలందేలా చేశారని, ఆ తర్వాత అవి సున్నా వడ్డీకి మారాయని చెప్పారు.
 కానీ గత ప్రభుత్వ హయాంలో 2016 నుంచి సున్నా వడీ పథకం పూర్తిగా నిల్చిపోయిందని గుర్తు చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, అక్క చెల్లెమ్మలు ఇంకా  అందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు. 


ఇబ్బందికర పరిస్థితి ఉన్నా!
 ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఒకేసారి రూ.1400 కోట్లు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి, ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని, అయినా ఇలాంటి పరిస్థితుల్లోనే అక్క చెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నామని చెప్పారు.
 8.78 లక్షల గ్రూపులకు చెందిన దాదాపు 91 లక్షల అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతుందని, ప్రతి గ్రూపునకు కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఈ పథకం వల్ల ప్రతి ఏడాది లబ్ధి కలుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.


ప్రభుత్వంపై వడ్డీ భారం
 పొదుపు సంఘాల మహిళలకు ఏటా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3 లక్షల పరిమితి వరకూ ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయని, మిగిలిన 7 జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై 11 నుంచి సుమారు 13.5 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారని చెప్పారు. సున్నా వడ్డీ పథకం అమలు చేయాలంటే 7 నుంచి 13.5 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. దీని వల్ల పొదుపు సంఘాల మహిళలకు మంచి జరుగుతుందని చెప్పారు.


మహిళా పక్షపాత ప్రభుత్వం
 తమ ప్రభుత్వం ప్రతి పథకంలో అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేసిందని, అందువల్ల ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. ఒక డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఇద్దరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒక మహిళ ఉన్నారని గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రతి పథకంలో కూడా మహిళలకు ప్రయోజనం కలిగేలా చూస్తున్నామని అన్నారు.


వారి చేతుల్లోనే డబ్బు సద్వినియోగం
 తల్లులు, అక్క చెల్లెమ్మల చేతుల్లోనే డబ్బు పెడితే పూర్తిగా సద్వినియోగం అవుతుందని, ఫలితాలు బాగుంటాయని, ప్రతి పైసా పూర్తిగా వినియోగం అవుతుందని సీఎం పేర్కొన్నారు. అందుకే పలు పథకాల్లో నగదును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా కొన్ని పథకాలను ఆయన ప్రస్తావించారు.


అమ్మఒడి. నాడు–నేడు
 43 లక్షల తల్లులు, తద్వారా 82 లక్షల పిల్లలకు మేలు జరిగేలా ఈ ఏడాది జనవరి 9 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని, పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు–నేడు కింద స్కూళ్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 


పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు
 ఒకవేళ కరోనా లేకపోతే.. ఇప్పటికే అక్షరాల 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో  రిజిస్ట్రేషన్‌ అయ్యేవన్న ముఖ్యమంత్రి, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. మహానేత వైయస్సార్‌ పుట్టిన రోజైన జూలై 8న నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ∙
 వచ్చే జులై 8న, మొత్తం 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామని వెల్లడించారు.


మహిళలకు ఇంకా ఏమేమిటి?
 నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చామని, వక్ర బుద్ధితో అక్క చెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చామన్న సీఎం, ఆ చట్టాన్ని త్వరలోనే రాష్ట్రçపతి ఆమోదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 ఇక 13 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు కూడా తీసుకువస్తున్నామని, ప్రత్యేక యాప్‌ కూడా రూపొందించామని, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీసును నియమించామని చెప్పారు. 11వేలకు పైగా మహిళా పోలీసులను రిక్రూట్‌ చేసి ఉద్యోగాలు ఇవ్వగలిగామని, గ్రామ సచివాలయాల్లో 7 నుంచి 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని, దీని వల్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసినా, గృహ హింస చోటు చేసుకున్నా గ్రామాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. 
 ఇంకా వసతి దీవెన పథకంలో దాదాపు 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని, డిగ్రీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత   చదువులు చదివే వారికి రెండు దఫాల్లో ఈ పథకంలో వారి తల్లుల ఖాతాల్లో రూ.20 వేల వరకు నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 
 గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.1880 కోట్లు పూర్తిగా చెల్లించడమే కాకుండా, ఈ ఏడాదికి సంబంధించి దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా భారం మోస్తూ, గత నెల 31 వరకు ఉన్న ఫీజు బకాయిలు అన్నీ కలిపి దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా మొత్తాన్ని మరో నాలుగు రోజుల్లో (వచ్చే మంగళవారం) పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మూడు నెలలు.. జూన్‌ నుంచి ఆగస్టు వరకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సెప్టెంబరులో నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.


చివరగా..
 ‘తమ పిల్లలు ఎలా చదువుతున్నారు?. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అని తల్లులు చూసుకుని ఆ ఫీజులు చెల్లిస్తారు. జవాబుదారీతనం కోసమే ఇలా చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేయడానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుతున్నాను’ అంటూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.


 కాగా, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పలువురు మహిళలు వైయస్సార్‌ సున్నా పథకంపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు కూడా మాట్లాడారు.


విశాఖపట్నం డ్వాక్రా మహిళ:
– కరోనా సమయంలో కూడా బియ్యం, కందులు, శనగలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలు కూడా ఇస్తున్నారు. సొంత అన్నదమ్ముల్లా ఇస్తున్నారు. మా ఊరిలో ఇళ్లస్థలం విలువ రూ.20 లక్షలు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పినా దాన్ని నిలబెట్టుకోలేదు. దీంతో రుణాలు, వాటి మీద వడ్డీలు తడిపి మోపెడయ్యాయి.
 పాదయాత్రలో నేను విన్నాను.. ఉన్నాను.. అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాం.


మాస్కుల తయారీపై సీఎం ఆరా
 ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, జిల్లాలో మాస్కుల తయారీ ఎలా ఉందన్న విషయాన్ని విశాఖ కలెక్టర్‌తో ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన మాస్కులు తయారు అవుతున్నాయని విశాఖ కలెక్టర్‌ చెప్పారు. మాస్కులను తొలుత రెడ్‌జోన్లలో పంపిణీ చేయాలని సీఎం నిర్దేశించారు.


తూర్పు గోదావరి జిల్లా మహిâ¶::
– సుదీర్ఘ పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు భరోసాగా నిలుస్తామన్నారు. అనుకున్నట్టే మాకు అండగా నిలుస్తున్నారు. వైయస్సార్‌గారు పావలా వడ్డీ కింద రుణాలు ఇచ్చారు. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం. గతంలో మమ్మల్ని మోసం చేసిన వారికి ఎలాంటి సమాధానం చెప్పామో చూశారు.
 కష్టకాలంలో కూడా మాకు అండగా ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా ఆదుకుంటున్నారు. మా కుటుంబాల్లో మాకు గౌరవం పెరిగింది. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా సేవ చేయిస్తున్నారు.
వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా గొప్ప ఆలోచనను అమల్లోకి తీసుకు వస్తున్నారు.
వాళ్లు దేవుళ్లులా సహాయం చేస్తున్నారు.
 గతంలో పెన్షన్‌ కోసం అవ్వాతాతలు ఎదురుచూపులు చూసే వారు. ఉదయం 8 గంటల్లోపే మీరు పెన్షన్‌ అందించేలా చూస్తున్నారు. ప్రతి విషయంలో మాకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దిశ చట్టాన్ని తీసుకు వచ్చి.. మహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నారు. యావత్‌ మహిళా లోకం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు:.
 నవరత్నాలతో అందరికీ మంచి జరుగుతోంది. పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బందులు లేకుండా చూశారు. అందరం రుణపడి ఉంటున్నాం. కుటుంబంలో పెద్ద దిక్కై కరోనా సమయంలో మూడు సార్లు రేషన్‌ ఇస్తున్నారు. వేయి రూపాయలు కూడా ప్రతి కుటుంబానికీ ఇచ్చారు. రోజూ కూడా గర్వపడేలా చేస్తున్నారు.


తూ.గో. జిల్లా కలెక్టర్‌:
– రూ.100కే పండ్లు కార్యక్రమాన్ని ప్రారంభించాం.
– పూల రైతులను ఆదుకునేందుకు కార్యక్రమం చేపట్టాం.
– పండ్లతో పాటు పూలు కూడా ఉచితంగా ఇస్తున్నాం.
– సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యక్రమం ప్రారంభం.


కర్నూలు జిల్లా మహిళ:
– వైయస్సార్‌గారు వడ్డీ భారం తగ్గించడానికి  పావలా వడ్డీ ప్రారంభించారు. కానీ మా దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయాం. గత ప్రభుత్వంలో జీరో వడ్డీ లేదు, రుణమాఫీ లేదు. పాదయాత్రలో మా కష్ట సుఖాలను తెలుసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మా కష్టసుఖాలను ఆలోచన చేసి సున్నా వడ్డీ పథకం తీసుకు వచ్చారు. అందుకు చాలా సంతోషిస్తున్నాము.


నెల్లూరు జిల్లా మహిళ:
– గత ప్రభుత్వ సమయంలో మమ్మల్ని మీటింగుల కోసం తిప్పుకున్నారు. ఇవాళ మీరు మాట నిలబెట్టుకున్నారు. కరోనా సమయంలో మీరు ఆదుకుంటున్న తీరు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి మీ మార్గనిర్దేశం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.


పద్మావతి, వైయస్సార్‌ కడప జిల్లా:
– కరోనాతో నానా కష్టాలు వచ్చాయి. ఈ సమయంలో సున్నా వడ్డీ వస్తుందా? లేదా? అని సందేహించాం. అయినా భారాన్ని భరించి మరీ మాకు సహాయం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం లేని సమయంలో కూడా మమ్నల్ని ఆదుకున్నారు. ఇంతటి కష్ట సమయంలో మాకు ఈ సహాయం చేసినందుకు ధన్యవాదాలు. కరోనా వల్ల వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో మీ సహాయం మమ్మల్ని చాలా ఆదుకుంది.


ప్రకాశం జిల్లా మహిళ:
– అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. 
వాలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వేయి రూపాయలు, మూడుసార్లు రేషన్‌ ఇవ్వడం చాలా మంది నిర్ణయాలు. మాస్క్‌ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం హర్షణీయం. అలాగే అరటి లాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా చేయిస్తున్నారు. దీని వల్ల ఉపాధి పొందుతున్నాం. మీటింగుల కోసం మమ్మల్ని వాడుకున్నారు తప్ప.. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు.