29న అప్పన్న చందనోత్సవం.. భక్తులకు దర్శనం లేదు
లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే మూడో తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఈనెల 29న జరగవలసిన సింహాద్రి అప్పన్న చందనోత్సవం (నిజరూప దర్శనం) కార్యక్రమాన్ని పరిమిత వైదిక సిబ్బందితో శాస్త్రోక్తంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు దేవస్థానం ఈవో ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు ఆమోదంతో చందనోత్సవాన్ని 15 మంది అర్చకులు, వైదిక సిబ్బందితో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ (అక్షయ తృతీయ) నాడు అప్పన్న నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజున లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.