జిల్లాలో 7 స్థాయిలుగా గుర్తించిన కోవిడ్ ఆసుపత్రులను  అన్ని సదుపాయాలతో సిద్దంగా వుంచాలి : గుంటూరు కలెక్టర్

- గుంటూరు, ఏప్రిల్ 29-   (అంతిమ తీర్పు) ;          -  జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున    ఆ మేరకు వైద్య చికిత్సలు అందించేందుకు జిల్లాలో 7 స్థాయిలుగా గుర్తించిన కోవిడ్ ఆసుపత్రులను  అన్ని సదుపాయాలతో సిద్దంగా వుంచాలని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. 


  బుధవారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యాలు మరియు ప్రత్యేక అధికారులతో హాస్పిటల్ ప్రిపెర్డ్ నెస్ పై జిల్లా కలెక్టర్  ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు కమల్ రాజ్ లతో కలసి  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్ మాట్లాడుతూ  జిల్లాలో చేపడుతున్న కోవిడ్ పరీక్షల స్థాయి పెరిగినందున ఆ మేరకు పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనబడే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్లుగా అన్ని విధాల హాస్పిటల్ ప్రిపెర్డ్ నెస్ పకడ్బంధీగా చేపట్టాల్సి వుందన్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో పేషెంట్ మేనేజ్మెంట్ చక్కగా నిర్వహించాలన్నారు.  మంచి చికిత్స అందించి మరణాల సంఖ్య పెరగకుండా చూడాల్సి వుందన్నారు.    
  
  జిల్లా కలెక్టర్  ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రోటోకాల్ పాటించే విధంగా హాస్పిటల్ ప్రిపెర్డ్ నెస్ వుండాలన్నారు. జిల్లాలో గుంటూరు పట్టణం తరువాత నరసరావుపేటలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. హాస్పిటల్ ప్రిపెర్డ్ నెస్ లో భాగంగా అవసరమైన వెంటిలేటర్లు త్వరలో జిల్లాకు అందనున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో పాజిటివ్ కేసులకు చికిత్స అందించడం జరుగుతున్నదని, పాజిటివ్ కేసులు పెరిగే కొద్ది జిల్లాలో గుర్తించిన జి జి హెచ్, కాటూరి మెడికల్ కాలేజీ, మణిపాల్ హాస్పిటల్, లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, డి వి సి హాస్పిటల్, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్సకు  సన్నద్ధం కావాల్సి వుందన్నారు. ఈ ఆసుపత్రులలో  మ్యాన్  పవర్, మేటిరియాల్, పరికరాలు సిద్దంగా ఉంచాల్సి వుందన్నారు. మరో రెండు రోజులలో సదరు ఆసుపత్రులలో హాస్పిటల్ ప్రిపెర్డ్ నెస్ పై మాక్ డ్రిల్   చేయడం జరుగుతుందని, ఆ మేరకు ఆసుపత్రులను సిద్దంగా వుంచాలని జిల్లా కలెక్టర్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులకు తెలిపారు.  నోటిఫికేషన్ ప్రకారం చికిత్స అందించేందుకు దరఖాస్తు చేసుకున్న వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులను త్వరగా ఎంపిక చేసి జాబితాను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. యాస్మిన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది.  


   రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు కమల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆ మేరకు చికిత్స అందించేందుకు  గుర్తించిన ఆసుపత్రులను సిద్దపరచు కోవలసి వుందన్నారు. ఇందులో భాగంగా హాస్పిటల్ ప్రిపెర్డ్ నెస్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది అంత సులభతరమైన పని కాదని, అందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి వుంటుందని తెలిపారు. అలాగే రోగులకు అందించే చికిత్స పక్కాగా వుండాల్సి వుందన్నారు. రోగులకు చికిత్స అందించడంతో పాటు వారి  మానసిక స్థితిని కూడా  పరిగణలోకి తీసుకోవలసి వుంటుందని తెలిపారు.   


  సమావేశంలో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, స్పెషల్ కలెక్టర్ బాబు రావు, జిజి హెచ్ పర్యవేక్షకులు డా. రాజు నాయుడు, కోవిడ్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు మరియు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.