ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

బహిరంగ లేఖ
తేది: 28.04.2020
నా ఆత్మీయ కుటుంబసభ్యులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు
నమస్కారాలు. 
ఈ పరిస్థితుల్లో మీకు ఇలా బహిరంగ లేఖ రాయాల్సివస్తుందని ఊహించ లేదు.  
 ఒక అసాధారణ, సంక్లిష్ట పరిస్థితిలో ప్రస్తుతం మన దేశం, మన రాష్ట్రం ఉన్నాయి. మానవ జాతి చరిత్రలో, నాగరిక సమాజం ఎదుర్కొన్న పెను విపత్తులలో కరోనా సంక్షోభం కనీవినీ ఎరుగనిది. 4నెలల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యాధి బారిన పడటం, లక్షలాదిగా మరణించడం కరోనా వైరస్ తీవ్రతకు నిదర్శనం. ఏ దేశంలో చూసినా రోజుకు వేలాదిమంది కరోనా వ్యాధి బారిన పడుతున్నారు.  గత వారం రోజుల్లోనే మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వ లెక్కలే వెల్లడిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నాం. 
ఈ క్లిష్ట సమయంలో, ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా, లాక్ డౌన్ నిబంధనలు మీరందరూ పాటిస్తూ, పరిశుభ్రతకు, ఆరోగ్య సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, చిన్నపిల్లల, వృద్దుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని భావిస్తున్నాను. 
కరోనా వైరస్ కు  వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. అప్పటిదాకా ముందు జాగ్రత్తలే దీనికి మందు. భౌతిక దూరం పాటించడం, పదేపదే చేతులు శుభ్రపర్చుకోడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక శుభ్రత పాటించాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎక్కడా గుంపులుగా గుమికూడరాదు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలి. 
 కరొనా మహమ్మారి భయోత్పాతం, మన జీవితాలతో పాటు, మన జీవనోపాధిని కూడా ప్రమాదంలోకి నెట్టింది. 
అత్యంత దుర్భరంగా వలస కార్మికులు, చేతివృత్తులవారి పరిస్థితి : 
వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. పనిచేసే చోట ఉపాధి కోల్పోయి, అక్కడ ఉండలేక స్వస్థలాలకు వెళ్లేందుకు వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కాలినడకన వేల కిమీ నడిచి వెళ్లడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. జీవనోపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, చర్మకారులు, ఆటో డ్రైవర్లు ఇతర అసంఘటిత కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. 
ఈ పరిస్థితుల్లో ‘‘అన్నా కేంటిన్లు’’ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేవనే వ్యాఖ్యలు పాలకుల చెవులకు వినిపించక పోవడం బాధాకరం. ‘‘చంద్రన్న బీమా పథకం’’ ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు, లాక్ డౌన్ లో మరణించిన వారి కుటుంబాలకు ఆధారంగా ఉండేది.  
 రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: 
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రబీ పంట చేతికి వచ్చే సమయానికి కూలీలు దొరకక, రవాణా స్థంభించి,మార్కెటింగ్ సౌకర్యాలు లేక, పండించిన పంటను పొలంలోనో, రోడ్డుమీదో వదిలి నిస్సహాయంగా, పగిలిన గుండెలతో జీవచ్చవంలా మారారు. రబీ పంటలు, హార్టీకల్చర్, ఆక్వా, సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలని, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే ముందుకొచ్చి కొనాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి ఉపయోగించాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం బాధాకరం. వేలం ఆలస్యం కారణంగా పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనక పోవడం శోచనీయం. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదు.  
విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేది: 
ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ విపత్తులలో ప్రజలకు అండగా నిలబడింది. ‘‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లనే’’ ఎన్టీఆర్ సూక్తికి కట్టుబడింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సేవకే అంకితమైంది. 
విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేది. క్షేత్ర స్థాయిలో ఉపశమన చర్యలు తీసుకోవడంతోపాటు యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగిరపర్చడమే నాయకత్వ లక్షణం.  ప్రతిపక్షంలో ఉండి కూడా 2009 కృష్ణా వరదల్లో, ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులను, గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో టిడిపి ముందుండి అండగా నిలబడింది. గోదావరి జిల్లాలలో పెనుతుపాన్ సమయంలో, ఒడిశా వరదల్లో, విశాఖ హుద్ హుద్ బీభత్సంలో, శ్రీకాకుళం తిత్లి తుపాన్ లో టిడిపి ప్రభుత్వం ఏవిధంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టి బాధితులను ఆదుకుందో మీకు తెలిసిందే. మొత్తం సెక్రటేరియట్ తో సహా కేబినెట్ మంత్రులంతా అక్కడే మకాం వేసి సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అవిశ్రాంతంగా పని చేయడాన్ని గుర్తు చేస్తున్నాను.
బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు అండగా తెలుగుదేశం: 
 ప్రస్తుత కరోనా విపత్తులో కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా అదే స్ఫూర్తితో పని చేస్తోంది. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరించాం. వ్యాధి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. పరిశుభ్రత ప్రాధాన్యత వివరించి ప్రజలను చైతన్య పరిచాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేదానిపై ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ప్రెస్ మీట్లు, వీడియోలు, కరపత్రాల ద్వారా అవగాహన పెంచాం.
 లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే, ప్రతి రోజూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ, పేదలు, రైతుల సమస్యలపై లేఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు ఇస్తున్నాం. ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రులకు, కేంద్ర అధికారులకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్ గారికి అనేక లేఖలు రాశాం. జిల్లా స్థాయిలో టిడిపి నాయకులు కూడా  కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి జిల్లా పార్టీ తరఫున లేఖలు పంపారు. 
టిడిఎల్ పి సమావేశం ఆన్ లైన్ లో నిర్వహించి కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాలను సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేశాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండున్నర లక్షల మాస్క్ లు ఫ్రంట్ లైన్ వారియర్లకు పంపిణీ చేస్తున్నాం. ఆన్ లైన్ లో ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. 
అయినా పట్టించుకోక పోవడంతో రైతులు, పేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు ఇళ్లలోనే 12గంటల నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని, రబీ పంటలు (ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు, టమాటా,కూరగాయలు...) పండ్ల తోటల ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా పునరుద్దరించాలనే డిమాండ్లతో ఇప్పటికే అనేకమంది టిడిపి నాయకులు 12గంటల దీక్షలు చేశారు. వివిధ మండలాల పార్టీ నాయకులు కూడా దీక్షలు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పేదలు, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నాం. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా టిడిపి నేతలు క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు ఆయా ప్రాంతాల్లోని పేదలకు  పంపిణీ చేశారు. 
వైసిపి నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి: 
అయితే అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కనీసం కంటైన్ మెంట్ జోన్లలో కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ  ఉధృతం అయ్యింది. 
మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనం బైటపెట్టడం పాలకుల లక్షణం కాదు. అప్పుడు ‘‘కరోనా వస్తుంది, పోతుంది, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’’ అని తేలిగ్గా వ్యాఖ్యలు, ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బైటపెట్టాయి. అన్నివర్గాల ప్రజలను ఆవేదనకు గురిచేశాయి.
కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమనే  వారి వ్యవహార శైలి రాష్ట్రాన్ని ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’’ నెట్టింది. వైసిపి నాయకులు యధేచ్ఛగా గుంపులుగా తిరుగుతూ శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీలు జరపడం, నగరిలో పూలు జల్లుకుంటూ ప్రారంభోత్సవాలు జరపడం, పొరుగు రాష్ట్రం నుంచి వాహనాల్లో అనుచరులను కనిగిరి ఎమ్మెల్యే తరలించడం, లాక్ డౌన్ లో కూడా కొండెపిలో బహిరంగ సభలు పెట్టడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుపట్టింది. 
వాలంటీర్ల వేతనాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. చౌకడిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది.  లాక్ డౌన్ ఉల్లంఘించి వైసిపి నాయకులు, వారి అనుచరులు యధేచ్చగా రాష్ట్రవ్యాప్తంగా వాహనాల్లో తిరుగుతూ వైరస్ వ్యాప్తికి సూపర్ స్ప్రెడర్లుగా తయారయ్యారనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. 
లాక్ డౌన్ లో కూడా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నాటు సారా విక్రయాలు పేట్రేగి పోయాయని సాక్షాత్తూ శాసన సభ స్పీకర్ తప్పు పట్టడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది.
హెల్త్ బులెటిన్లను ఫార్స్ గా మార్చారు-కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారు: 
విదేశాల్లో, ఇతర రాష్ట్రాలలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ 4టి విధానం సత్ఫలితాలు ఇస్తుంటే మన రాష్ట్రంలో సరైన దిశానిర్దేశం కొరవడటం బాధాకరం. హెల్త్ బులెటిన్లను కూడా మన రాష్ట్రంలో ఒక ఫార్స్ గా మార్చారు. వాటిలో అంకెల గారడీపై మీడియాలో వార్తలు రావడంతో రోజుకు 3బులెటిన్ల బదులు ఒక్కదానికే తగ్గించారు. 
చివరికి కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో కూడా అవినీతికి పాల్పడటం హేయం. ఎన్ని ఎక్కువ టెస్ట్ లు జరిపితే కరోనా వైరస్ ను అంతగా కట్టడి చేయగలమనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశం కాగా,  మన రాష్ట్రంలో మాత్రం టెస్టింగ్ లను నిర్లక్ష్యం చేయడమే పెను విషాదం అయ్యింది. 
పిపిఈలు ఇవ్వకపోవడం వల్లే డాక్టర్ల ప్రాణాలు బలి: 
ప్రాణాలు కాపాడే డాక్టర్లు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వారి ప్రాణాలనే బలిగొంటోంది. నాసిరకం పిపిఈలతో కరోనా వైరస్ పై యుద్దానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే. కర్నూలు, నెల్లూరు డాక్టర్ల విషాదాంతమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. గుంటూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాలలో అనేకమంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకడమే వారికి సరైన పిపిఈలు లేకపోవడానికి నిదర్శనం. భద్రతా పరికరాలు(పిపిఈ) అడిగిన డాక్టర్ ను, మున్సిపల్  కమిషనర్ ను సస్పెండ్ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. 
 ఎంపి కుటుంబానికి, రాజ్ భవన్ లో పలువురికి వైరస్ సోకడం- వైసిపి ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట:
ఒక ఎంపి కుటుంబంలో 6గురికి వైరస్ సోకడం, వారిలో 4గురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్ భవన్ లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్ట్ లు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ నాణ్యమైన భద్రతా పరికరాలు (పిపిఈలు) అందించాలని ఎన్నిలేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం. 
ప్రధానమంత్రి 4సార్లు ముఖ్యమంత్రులతో ఆన్ లైన్ సమావేశాలు జరిపి, మాజీ రాష్ట్రపతులు, ప్రధానులతో, ప్రతిపక్ష నాయకులతో సంప్రదించి పరస్పర అభిప్రాయ సేకరణతో ఉపశమన చర్యలు చేపడుతుంటే, అటువంటి చొరవ, సామర్ధ్యం మన రాష్ట్ర పాలకుల్లో లేకపోవడం శోచనీయం. ప్రజల ప్రాణాలతో పాలకులే చెలగాటం ఆడటం గతంలో ఎన్నడూ చూడలేదు. 
వైసిపి రంగులపై ఉన్న శ్రద్ద కరోనా టెస్టింగ్ లపై లేదు: 
రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ద వైసిపి నాయకులకు ప్రజారోగ్య పరిరక్షణపై లేదు. స్థానిక ఎన్నికలపై ఉన్న ఆసక్తి, కరోనా వైరస్ నియంత్రణపై లేదు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల ప్రధానాధికారిని తొలగించడం, హుటాహుటిన చెన్నై నుంచి మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం, ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపివ్వడం, వైసిపి నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చింది. 
ఈ పరిస్థితులన్నీ చూసే పొరుగు రాష్ట్రాలన్నీ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కర్నూలు పోవద్దని మహబూబ్ నగర్ వాసులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. మన రాష్ట్రం నుంచి తమిళనాడులోకి రాకుండా ఏకంగా రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడం గమనార్హం.
రాజధాని తరలింపుపై ఉన్న శ్రద్ద, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలపై లేకుండా పోయింది. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయడంలో చూపే ఆసక్తి, ప్రజలకు వైరస్ టెస్టింగ్ లు నిర్వహించడంలో లేకపోవడం మన రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యాలకు ప్రత్యక్ష రుజువు. నన్ను నిందించినా, టిడిపిని దూషించినా ప్రజల కోసం భరిస్తాం. కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని భరించలేం. 
 ‘‘మన ఊరు-మనవార్డు- మన సమాజాన్ని’’ మనమే కాపాడుకోవాలి: 
ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులు బాధ్యత విస్మరించారు. అధికారులు స్వతంత్రంగా వ్యవహరించి బాగా పనిచేసిన చోట్ల కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. వైసిపి నాయకులు ఇష్టారాజ్యంగా చేసిన చోట్ల దుష్ఫలితాలు చూశాం.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే ముందుకొచ్చి తమ పౌర బాధ్యతలు నెరవేర్చాలి. ‘‘మన ఊరు-మన వార్డు-మన సమాజాన్ని’’ మనమే కాపాడుకోవాలి. 
     చివరిగా....మీ శ్రేయోభిలాషిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఒక మాట. కష్టాలు కల కాలం ఉండవు. అందుకే అందరూ ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కరోనా నేర్పిన పాఠాలతో, ఆరోగ్యంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటూ, సామాజిక బంధాలను పరిరక్షించుకుంటూ, మనందరం ఆరోగ్యంగా, క్షేమంగా ఉందాం.. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం. 
నారా చంద్రబాబు నాయుడు
(శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత)


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image