మేకపాటి ఆదేశాలతో విస్తృతంగా సేవలు: వై.సి.పి నాయకులు పల్లాల కొండారెడ్డి

యం.యల్.ఏ మేకపాటి ఆదేశాలతో విస్తృతంగా సేవలు: వై.సి.పి నాయకులు పల్లాల కొండారెడ్డి.


.. వింజమూరు, ఏప్రిల్ 10 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వింజమూరు మండలంలో నిత్యావసర సరుకులు విరివిగా పంపిణీ చేస్తున్నట్లు వింజమూరు మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లాల కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో మన భారతదేశంలో ఈ వైరస్ నివారణ దిశగా ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ వలన ఆర్ధిక వ్యవస్థ పతనం అవుతూ, వృద్దిరేటు క్షీణిస్తున్నా మన ప్రభుత్వాలు లెక్కచేయక ప్రజల సం రక్షణే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారన్నారు. లాక్ డౌన్ వలన ప్రజలందరూ స్వీయ నిర్భంధంలోనే ఉండాలనే స్పష్టమైన ఆం క్షలు, ఆదేశాలు ఉన్నాయన్నారు. కరోనా వైరస్ కట్టడికి అదోక్కటే పరిష్కార మార్గంగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయని కొండారెడ్డి అన్నారు. ముఖ్యంగా కూలీల పరిస్థితులు జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారాయన్నారు. లాక్ డౌన్ వలన ఏ పనులూ లేక వారు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వీటిని గమనించి యం.యల్.ఏ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ప్రతినిత్యం భోజనాలు అందజేస్తున్నామన్నారు. అంతేగాక లాక్ డౌన్ తో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పరిమితి గడువు ఉన్నందున అందరికీ సరుకుల కొనుగోలుకు సౌలభ్యం గగనంగా మారిందన్నారు. ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో నిత్యావసర వస్తువులైన కూరగాయలు, వంట సరుకులు విరివిగా అందజేస్తున్నామన్నారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు చాకలికొండ, తమిదపాడు, కాటెపల్లి, ఊటుకూరు, గుండెమడగల, నల్లగొండ్ల, చంద్రపడియ, బుక్కాపురం, నేరేడుపల్లి తదితర గ్రామాలతో పాటు పేద వర్గాలు నివసించే కాలనీలలో తమ సేవలను విస్తృతపరుస్తున్నామన్నారు. ఈ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ కూడా ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, గృహ నిర్భంధంలో ఉండటం, శానిటైజర్లను వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రతలను పాటించడం లాంటి వాటిని విధిగా అలవరుచుకోవాలని పల్లాల.కొండారెడ్డి విజ్ఞప్తి చేశారు.