సేవా కార్యక్రమాలకు కార్యదర్శుల

*సేవా కార్యక్రమాలకు కార్యదర్శుల ప్రోత్సాహం*వింజమూరు, ఏప్రిల్ 9 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి)  ;ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎటు చూసినా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ప్రజల సం క్షేమం దృష్ట్యా ప్రభుత్వాలు విధించిన నిబంధనలకు కొంతమంది మినహా మిగతా ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వీయ నిర్భంధం పాటిస్తున్నారు. అయితే రెక్కాడితే గానీ డొక్కాడని కొన్ని కుటుంబాలకు కూలి పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని గమనించిన పలువురు దాతలు ముందుకు వచ్చి విరివిగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మండలంలోని వివిద పంచాయితీలలో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులు పేదలకు సేవలందించేందుకు దాతలు ముందుకు రావాలని చేస్తున్న విన్నపాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మండల స్థాయి అధికారులు సైతం కరోనా నియంత్రణ కోసం అహర్నిశలూ శ్రమిస్తూ నిరుపేదలను ఈ సమయంలో ఆదుకునే దాతలను మరింతగా ప్రోత్సహిస్తుండటం విశేషం. దాతలు చేపట్టే సేవా కార్యక్రమాలకు హాజరవుతూ వారి వారి దాతృత్వాలను ప్రశంసిస్తూ మిగతావారికి కూడా స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తున్నారు. వింజమూరు మండలంలో కనీవినీ ఎరుగని రీతిలో పలువురు స్వచ్చందంగా ముందుకు వచ్చి పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇందులో భాగంగా తహసిల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీలను ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తున్నారు. అధికారులు కూడా దాతలను మరింతగా ప్రోత్సహిస్తూ ఆయా కార్యక్రమాలలో అలుపెరగకుండా పాల్గొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు దాతలు, ఇటు అధికారులు ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు దేవుడిచ్చిన వరంగా మారారు.