జరిమానాలు చెల్లించకుండా కొత్త వీసా తో కువైట్ రావచ్చు  - ఏపీఎన్ఆర్టీఎస్) అధ్యక్షులు  వెంకట్  ఎస్  మేడపాటి, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్

జరిమానాలు చెల్లించకుండా కొత్త వీసా తో కువైట్ రావచ్చు 
- ఏపీఎన్ఆర్టీఎస్) అధ్యక్షులు  వెంకట్  ఎస్  మేడపాటి, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్  
అమరావతి : వీసా గడువు ముగిసిపోయినా  కువైట్ లో  ఉంటున్న  మన భారతీయులు  క్షమాబిక్ష ( ఆమ్నెస్టీ ) ద్వారా ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా, మళ్లి కొత్త వీసా తో కువైట్ రావచ్చు అనే వెసులుబాటు కల్పించడమే కాక, వారిని భారతదేశంకు పంపే బాధ్యత తీసుకుని, స్వదేశానికి పంపే వరకు వారిని షెల్టర్లలో ఉంచి మంచి సదుపాయాలు  కల్పిస్తున్నందుకు, కువైట్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్   రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కువైట్ లో ఉన్న ఏపీ తెలుగు వారి తరఫున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్  తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) అధ్యక్షులు  వెంకట్  ఎస్  మేడపాటి, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్  కృతజ్ఞతలు తెలుపుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. విదేశాలలో కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అయినందున పనులు లేక ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన  తెలుగు వారిని, సామాజిక సేవ చేస్తూ, గొప్ప మనసుతో ఆదుకుంటున్న వారందరూ అక్కడి ప్రభుత్వాల ఆదేశాలు పాటిస్తూ,  ప్రతి ఒక్కరు దయచేసి  సామాజిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేశారు. ముఖ్యంగా కువైట్, దుబాయి, ఖతార్ లలో ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యులు, ఎన్నో సంక్షేమ సంస్ధలు చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని అన్నారు.   ఎవరు అయితే తాత్కాలిక పాస్  పోర్ట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారో వారు 26 - 04 - 2020 న రెండవ విడత ఆమ్నెస్టీ కొరకు ఏర్పాటు చేసిన షెల్టర్ కు వెళ్ళే ముందు, దయచేసి ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ వాట్సాప్ నెం : +91 8500627678 కు పూర్తి వివరాలు పంపమని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాలలో  రాష్ట్రానికి చెందిన  ఎంతో మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో  పలు సంస్థల్లో హెల్పర్స్ గా, డ్రైవర్లుగా, ఇళ్ళల్లో పనులు చేసుకుంటున్న వారే అధికంగా ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వీరందరు  ఉపాధి కోల్పోవడం తో రోజువారి అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధి లేకుండా ఉంటున్న వారికి ఆహారం, వసతి అందించమని గల్ఫ్ దేశాలలోని  వివిధ భారత రాయబార కార్యాలయాలకు  ఇ-మెయిల్ పంపామని తెలిపారు. ఏపీ కి చెందిన  తెలుగు అసోసియేషన్స్, ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్లు, ఎన్నో సామాజిక సేవ సంస్థలు వారికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయని అన్నారు. సహాయ సహకారాలు అందిస్తున్న గల్ఫ్ దేశాలలోని  భారత  రాయబార కార్యాలయ అధికారులకు,  వివిధ తెలుగు అసోసియేషన్స్, ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్లకు ఏపీఎన్ఆర్టీఎస్ ధన్యవాదాలు తెలుపుతోంది అన్నారు. లాక్  డౌన్ తర్వాత ఆమ్నెస్టీ పై మరియు సెలవులపై రాష్ట్రానికి  వచ్చే వారు  కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. ప్రతిఒక్కరు ఇందుకు సహకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో  సమన్వయం చేసుకుంటూ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలియజేసారు.  ఏపీఎన్ఆర్టీఎస్ ఉచిత అంబులెన్సు సేవ అందించడం లో  లాక్ డౌన్ కారణంగా గత మూడు వారాలుగా అనేక ఇబ్బందులు ఎదురవడం తో  ఉచిత అంబులెన్స్ సేవను త్వరితగతిన అందించలేకపోతున్నాం అని తెలిపారు. మరింత సమాచారం కొరకు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నంబర్లు  0863 2340678, 8500627678 లను సంప్రదించండి.