వలస కార్మికులకు ఆహారం

ప్రపంచములో విలువైనది, వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే  అది మన సమయం (టైం). మనము ఇతరులకు కూడా ఇవ్వగలిగిన విలువైనది ఏదైనా ఉందంటే అదీ సమయమే. కోల్పోయిన డబ్బు, ఆస్తి ఇంకా ఏమైనా... మరల సంపాదించవచ్చు, కానీ కరిగిపోయిన ఈ క్షణాలు మళ్ళి  తిరిగిరావు అనేది జగమెరిగిన సత్యం.  వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయినా షేక్ ఇర్ఫాన్, తనకున్న విలువైన సమయాన్ని నిస్సహాయలతో, నిరాశ్రయులతో గడపటం తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా అవకాశాన్ని వెతుక్కొని మరీ అభాగ్యులకు తోడ్పడుతుంటాడు. హెల్పింగ్ హాండ్స్ అనే పేరు మీద నెల్లూరు లో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వతిస్తున్నారు. సర్వాంతర్యామి అయినా ఆ భగవంతుడిని  ఎప్పుడు చూడలేదుకాని మానవ రూపంలో వున్న ప్రతిమనిషి దేవుడే అని గట్టిగా నమ్మే సైద్ధాంతికుడు. కనిపించని దేవుడికి ఇచ్చే అర్పణలకన్నా,  నిస్సహాయ స్థితిలో వున్న నిర్భాగ్యులకు సేవ చేయటం మాధవ సేవయే అని రూఢిగా నమ్మే మానవతావాది.  ఎవరో వస్తారని... ఏదో చేస్తారని.... ఎదురుచూడడంకన్నా.. మనకు మనమే ఉద్దరించుకోవాలని  నాలుగు దశాబ్దాలక్రితం  శ్రీ శ్రీ  గారు వ్రాసిన మాటలు ఇలాంటివారి చేతల ద్వారా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.  లాక్ డౌన్ సమయంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపకులు చేస్తున్న హెల్ప్ ది నీడి (Help The Needy) కార్యక్రమములో ఈ రోజు పాలుపంచుకొని తన వంతు సాయంగా కొండాయపాలెం ఊరు వెలుపల వున్న వలస కార్మికులకు భోజనం పెట్టారు. 
ధన్యవాదాలు 
డా. ఉదయ్ అల్లం