ప్రతి రేషన్ షాపు వద్ద స్యానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు భౌతిక దూరం పాటించాలి


చిత్తూరు, ఏప్రిల్ 29: జిల్లాలో నేడు ప్రారంభమైన 3వ విడత రేషన్ పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు 1,82,538 మంది కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయుటలో భాగంగా 3వ విడత రేషన్ పంపిణీ జరుగుతున్నదని, ప్రతి రేషన్ షాపు వద్ద స్యానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా ప్రతి డీలర్ చర్యలు చేపట్టడంతో పాటు డీలర్ కూడా మాస్క్ లు ధరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 16.10 శాతంతో 1,82,538 మంది కార్డుదారులకు నిత్యావసర సరుకులను బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయడం జరిగిందని, రెడ్ జోన్ ప్రాంతాలలో వాలంటీర్లే డోర్ డెలివేరి చేయడం జరిగిందని, కార్డులోని ప్రతి సభ్యునికి 5కిలోల బియ్యం, ప్రతి కార్డుదారునికి ఒక కిలో కండిపప్పు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు.