అదనపు కౌంటర్ల ద్వారా రెండో విడ‌త రేష‌న్ పంపిణీ..

 


 


 


 


         అమరావతి ఏప్రిల్ 9 :


*ఈ నెల 15వ తేదీ నుంచి 50,000 పైగా అదనపు కౌంటర్ల ద్వారా రెండో విడ‌త రేష‌న్ పంపిణీ..!*


29వేల రేషన్‌ షాపులతో కలిపి మొత్తం 80వేల కౌంటర్ల ద్వారా పంపిణీ..


ఈసారి కందిపప్పుకు బదులు శనగపప్పు అందజేత..


లబ్ధిదారులకు వలంటీర్ల ద్వారా కూపన్లు..


రద్దీ నియంత్రణే సర్కారు ప్రధాన లక్ష్యం.. 


కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు రెండో విడత సరుకుల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా అదనపు కౌంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. మొదటి విడత కింద గత నెల 29 నుంచే బియ్యం, కందిపప్పును పంపిణీ చేసిన సర్కారు రెండో విడత కింద ఈనెల 15 నుంచి వాటిని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది..


అలాగే, రేషన్‌ షాపుల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రతీ షాపునకు అనుబంధంగా అవసరాన్ని బట్టి రెండేసి దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 29,620 వరకు రేషన్‌ షాపులుండగా.. అదనపు కౌంటర్లతో ఆ సంఖ్య దాదాపు 80 వేలకు పెరిగే అవకాశముంది. 


లబ్ధిదారులకు కూపన్ల జారీ..


రేషన్‌ షాపు వద్దకు ఎన్ని గంటలకు రావాలనే సమాచారంతో పాటు సరుకులు తీసుకునేందుకు ఈసారి అధికారులు లబ్ధిదారులకు కూపన్లను జారీ చేయనున్నారు. వీటిని వలంటీర్ల ద్వారా అందజేస్తారు.  


► కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెడ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వలంటీర్లే ఇంటింటికీ రేషన్‌ను అందించనున్నారు. 
 
► రెండో విడతలో కందిపప్పుకు బదులు శనగపప్పు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.  


► రేషన్‌ షాపులకు అనుబంధంగా అదనపు కౌంటర్ల కోసం స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, గ్రామ సచివాలయాలను గుర్తిస్తున్నారు.  


► వీటిల్లో స్టాకును భద్రపరుస్తారు. 


► ఏ సమయంలోనైనా 10 మందికి మించకుండా క్యూలో ఉండేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 


► మొదటి విడత మాదిరిగానే రెండో విడతలో కూడా లబ్ధిదారుల వేలి ముద్రల అవసరం లేకుండా వీఆర్వో లేదా ఇతర అధికారి బయోమెట్రిక్‌ ఆధారంగానే సరుకులు పంపిణీ చేస్తారు.