జర్నలిస్టులకు ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించాలి. :ఏపీయూడబ్ల్యూజే డిమాండ్..

 


అమరావతి, ఏప్రిల్ 11: కరోనా మహమ్మారి  మన వైద్య, ఆర్థిక వ్యవస్థల ను ధ్వంసం చేస్తున్న నేపథ్యం లో మీడియా వరంగం లో పనిచేస్తున్న వర్కింగ్   జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్  సిబ్బంది  ఆరోగ్య,ఉద్యోగ భద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వాలూ, యాజమాన్యాలు ముందుకు రావాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీయుడబ్ల్యూ జే)  ఒక ప్రకటన లో కోరింది. ప్రస్తుతం పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక  పరిస్తితులను  కరోనా మహమ్మారి  తీవ్రంగా మార్చివేసిన నేపథ్యం లో మీడియా రంగం తీవ్ర సంక్షుభిత పరిస్తితులను ఎదుర్కుంటున్న జీవన  వాస్తవికతను  యూనియన్ కూడా పరిగణన లోనికి తీసుకుంటున్నదని ఆ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సంక్షోభాన్ని  ప్రభుత్వాలూ, యాజమాన్యాలూ, వర్కింగ్ జర్నలిస్టులూ, నాన్ జర్నలిస్ట్ లు ఉమ్మడిగా ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయం లో తమ వంతు బాధ్యతలను నెరవేర్చేందుకు మీడియా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని యూనియన్ ఆ ప్రకటనలో తెలిపింది. మీడియా రంగం లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్  సిబ్బంది గత నెల రోజులుగా ప్రతికూల పరిస్థితుల్లో సైతం  తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణ చేస్తున్నారని, కరోనా వ్యతిరేక పోరాటం లో మిగిలిన వ్యవస్థలతో పాటు భుజం కలిపి పనిచేస్తున్నారని యూనియన్ గుర్తు చేసింది. లాక్ డౌన్ లో  పోలీస్ ఆంక్షల పర్యవసానంగా రాష్ట్రం లో పలు కేంద్రాల్లో  పాత్రికేయులు పోలీస్ దౌర్జన్యాలను కూడా చవి చూడాల్సి వచ్చిందని యూనియన్ విచారం వ్యక్తం చేసింది. సమాచార సేకరణ కోసం ఆరోగ్య పరంగా ప్రమాదకరమైన, సున్నిత ప్రాంతాల్లో సైతం మీడియా సిబ్బంది పనిచేస్తున్నారని అయితే వైద్య, ఆరోగ్య సిబ్బందికి, ప్రజారోగ్య కార్మికులకు,ఇచ్చిన సురక్షా పరికరాలు పాత్రికేయులకు ఇవ్వలేదని, అలాగే వివిధ విభాగాల సిబ్బందికి  కరోనా  బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు మీడియా సిబ్బంది కి అటువంటి ఏర్పాటు చేయక పోవడం విచారకరమని యూనియన్ ఆ ప్రకటన లో తెలిపింది. ప్రభుత్వం వెంటనే  పాత్రికేయులందరికీ మాస్క్ లు, గ్లోవ్స్,సానిటైజర్లు, సరఫరా చేయాలని, 50 లక్షల రూపాయల  ఆరోగ్య  బీమా కల్పించాలని యూనియన్ కోరింది.  రేషన్ కార్డు తో ప్రమేయం లేకుండా గ్రామీణ పాత్రికేయులు అందరికీ ఉచిత రేషన్, పది వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.  కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభ పరిస్తితుల్లో మిగిలిన రంగాలకు ప్రకటించినట్లు గానే   మీడియా రంగానికి కూడా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దీపన పథకాన్ని ప్రకటించాలని యూనియన్ కోరింది. మీడియాసంస్థల రుణాలపై మారటోరియం  ప్రకటించాలని, సిబ్బంది గృహ,వాహన, వ్యక్తిగత రుణాల చెల్లింపు ఏడాది పాటు  వాయిదా వేసి వడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.  న్యూస్ ప్రింట్, ఇంకులు, రాయితీ ధరలకు సరఫరా చేయాలని, మీడియా సంస్థలను  విద్యుత్ బిల్లుల నుండి ఆర్నెల్ల పాటు  మినహాయించాలని, యూనియన్ కోరింది.  ప్రస్తుత కష్ట కాలంలో ఉద్యోగాల కుదింపు, జీతాల కోత వంటివి చేపట్ట రాదన్న కేంద్ర ప్రభుత్వ సూచనను స్వాగతిస్తున్నట్లూ  యూనియన్ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ సూచనను తప్పని సరిగా పాటించాలని  మీడియా  యాజమాన్యాలను డిమాండ్ చేసింది. ఇప్పటికే రాష్ట్రం లోని పలు సంస్థల యాజమాన్యాలు సిబ్బందిని కుదించే ప్రయత్నాలు మొదలెట్టడం ఆందోళన కలిగించే పరిణామమని యూనియన్ విచారం వ్యక్తంచేసింది.  దశాబ్దాల తరబడి ఇదే వృత్తిలో వుంటూ, సంస్థల కష్టాలలో పాలు పంచుకుని, ఎన్నో త్యాగాలు చేసిన సిబ్బందిని ఇటువంటి   కష్టకాలం లో సాగనంపాలని చూడడం అమానుషమని, దాంతో  వారి కుటుంబాలు రోడ్డున పడతాయని యూనియన్  ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితులలోనూ ఉద్యోగాల కుదింపు చేయరాదని డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగం లో కొనసాగే సిబ్బందికి  జీతాల కోత కూడా సమంజసం కాదని యూనియన్ స్పష్టం చేసింది. నిర్వహణ లో ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంస్థ మనుగడకు కీలక మైన సిబ్బంది ఉద్యోగ, వేతన భద్రత విషయంలో యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాలని,  లేనిపక్షంలో  కార్మిక శాఖ, న్యాయస్థానాల  జోక్యం కోసం ఫిర్యాదు చేయక తప్పదని  యూనియన్ స్పష్టం చేసింది. 


*ఐ. వి. సుబ్బారావు, అధ్యక్షుడు*   
*చందు జనార్దన్, ప్రధాన కార్యదర్శి.*
*ఏపీయూడబ్ల్యూజే*