తక్షణమే కోటి మంది కాపు మహిళలకు జగన్ హామీ మేరకు రూ.15వేలు సాయం అందించాలి : బోండా ఉమామహేశ్వరరావు 

తేదీః 09-05-20
బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం వివరాలు
నవరత్నాల పేరుతో దగా- జగన్ ఏడాది పాలనలో ఏ ఒక్క సామాజికవర్గం అయినా బాగుపడ్డారా
కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బ్రాహ్మణ కార్పోరేషన్ల ద్వారా ఒక్కరికి కూడా సాయం అందలేదు
తక్షణమే కోటి మంది కాపు మహిళలకు జగన్ హామీ మేరకు రూ.15వేలు సాయం అందించాలి
టీవీ-5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- బోండా ఉమామహేశ్వరరావు 
         రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను ఎత్తిచూపితే.. మాపై మాచర్లలో హత్యాయత్నం చేశారు. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. వారిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఫ్యాక్షన్ మనస్తతత్వంతో పనిచేస్తోంది. టీడీపీనే కాకుండా అన్ని వ్యవస్థల్లోనూ ఇదే విధంగా ఉంది. మీడియాను నిలువరించేందుకు ప్రత్యేక జీవో తీసుకువచ్చారు. మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. చీఫ్ రిపోర్టర్లను బెదిరించడం, మీడియా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం, ఇవాళ టీవీ 5 కార్యాలయంపై దాడికి పాల్పడి అద్దాలు పగులగొట్టారు. మొత్తం ఆఫీసును తగులబెట్టాలని చూశారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా. నియంతపాలన సాగుతోంది. టీవీ 5పై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దొంగ జీవోను తీసుకువచ్చి పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
          నవరత్నాలని ఊదరగొట్టిన వైసీపీ.. ఏ రత్నం కూడా ప్రజలకు పూర్తిగా ఇవ్వకుండా దగా చేసింది. కాపు సామాజికవర్గానికి టీడీపీ మొట్టమొదటిసారిగా కాపు కార్పోరేషన్ ఏర్పాటుచేసి 3వేల కోట్లు వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.2వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీ ఇచ్చిన జగన్..నేడు ఏడాది పూర్తవుతున్నా.. కార్పోరేషన్ కు వెయ్యి రూపాయలు కూడా మంజూరు చేయలేదు. కాపు మహిళలకు రూ.15వేలు ఖాతాల్లో వేస్తామన్నారు. కోటి మంది మహిళలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు నెలలుగా జగన్ అసమర్థత వల్ల పేదలు పస్తులు ఉంటున్నారు. వీరిని ఆదుకునేందుకు మనసు రాలేదు. మరోవైపు కావాల్సిన కాంట్రాక్టర్లకు వేలకోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. జే-ట్యాక్స్ కోసం మద్యం షాపులు తెరిచారు. 30వేల కోట్ల ఆదాయం వస్తున్నా.. కాపులను ఆదుకునేందుకు చేతులు రావడం లేదు. కాపు మహిళలు రెండు నెలల నుంచి పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి కులానికి కార్పోరేషన్ ఏర్పాటుచేసి, నిధులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన జగన్.. మాట తప్పారు. బ్రాహ్మణులకు గత టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. జగన్ ఏడాది గడిచినా బ్రాహ్మణ కార్పోరేషన్ కు రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. నేడు పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణులు పస్తులుంటున్నారు. పేద బ్రాహ్మణులకు రూ.5వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంద కండిషన్లు పెట్టారు. బీసీ కార్పోరేషన్ కు చంద్రబాబు అత్యధిక నిధులు మంజూరు చేస్తే.. నేడు జగన్ బీసీ కార్పోరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల కోసం బీసీ సోదరులు ఎదురుచూస్తున్నారు. కాపులను, బీసీలను, బ్రాహ్మణులను నాశనం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు ఒక్కరికి కూడా సాయం చేయలేదు. పనుల్లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.  ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా. ఎస్సీ కార్పోరేషన్ నుంచి ఏడాది కాలంగా ఒక్కరికి కూడా సాయం చేయలేదు. ముస్లీం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చింది. ఇప్పడవేమీ లేవు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను కూడా రద్దు చేశారు. జగన్ కు కమీషన్లు వచ్చేవాటి కోసం నిధుల లోటు లేకుండా చూసుకుంటున్నారు. కేంద్ర నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు. జగన్ చుట్టూ తిరిగే పదిమంది రెడ్లకు తప్ప అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. హామీ ఇచ్చిన విధంగా కోటి మంది కాపు మహిళలకు తక్షణమే రూ.15వేల సాయం అందించాలి. బ్రాహ్మణులకు గత టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను పునరుద్ధరించాలి. బీసీ కార్పోరేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలి. పాస్టర్లకు జగన్ రూ.5వేలు ఇవ్వడం లేదు. ఎస్సీ,ఎస్టీలను జగన్ ఆదుకోవాలి. రజకులకు, టైలర్లకు సాయం చేస్తామని చెప్పి మాట తప్పారు.  ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్ ఏడాది పాలనలో ఏ ఒక్క సామాజికవర్గం అయినా బాగుపడ్డారా అని ప్రశ్నిస్తున్నా. ఏడాది కాలంగా రాష్ట్రానికి దరిద్రం పట్టింది.