*కలిగిరి మార్కెటింగ్ యార్డులో 250 బస్తాల ధాన్యం అపహరణ* దర్యాప్తు చేపట్టిన కలిగిరి సి.ఐ రవికిరణ్.... ఉదయగిరి, మే 3 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోకవర్గంలోని కలిగిరి మండలం జిర్రావారిపాళెం మార్కెటింగ్ యార్డులో రైతులు నిల్వ ఉంచిన దాదాపు 250 ధాన్యం బస్తాలు శనివారం రాత్రి అపహరణకు గురయ్యాయి. ఆదివారము తెల్లవారుజామున రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెటింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తదుపరి అధికారులు, రైతులు కలిగిరిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే కలిగిరి మండలంలోని జిర్రావారిపాళెం మార్కెట్ యార్డులో రైతుబంధు పధకం కింద జలదంకి మండలంలోని బ్రాహ్మణకాక గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుబ్బరత్నమ్మ అనే రైతులు 2018లో ధాన్యం నిల్వ చేశారు. అందుకు సంబంధించి వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిపాజిట్ నగదును పొందారు. అయితే ఇటీవల ఆశించిన ధర రావడంతో నిల్వ ఉంచిన ధాన్యమును విక్రయించుకునేందుకు రైతులు సన్నద్దమయ్యారు. మార్కెటింగ్ శాఖ అధికారులకు డిపాజిట్ గా తీసుకున్న నగదును చెల్లించారు. ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అధికారుల అనుమతితో ఆదివారం ఉదయం సదరు రైతులు మార్కెట్ యార్డుకు తరలివెళ్ళిన సమయంలో షట్టర్లు తీయగా ధాన్యం కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న వారు ఈ విషయమును మార్కెట్ కమిటీ అధికారులకు తెలియపరిచారు. వారు వచ్చిన అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కలిగిరి సి.ఐ రవికిరణ్, ఎస్.ఐ వీరేంద్రబాబులు మార్కెట్ యార్డుకు వెళ్ళి పరిశీలించారు. ధాన్యం మాయమైన తీరు పట్ల యార్డులో ఉన్న పలువురిని ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఈ సందర్భంగా సి.ఐ రవికిరణ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
కలిగిరి మార్కెటింగ్ యార్డులో 250 బస్తాల ధాన్యం అపహరణ -దర్యాప్తు చేపట్టిన కలిగిరి సి.ఐ రవికిరణ్....