విద్యా సంస్థలు ప్రారంభించిన తరువాత ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్దులను సైతం 28 రోజుల క్వారంటైన్  తరువాత మాత్రమే  హాస్టల్స్ లోకి అనుమతించేలా  చర్యలు తీసుకోవాలన్నారు

-గుంటూరు, మే 11-2020 :-  జిల్లాలో  లాక్ డౌన్ తొలగించిన  తరువాత ఇతర ప్రాంతాల వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నా,  కరోనా వైరస్ వ్యాప్తి  నియంత్రణలో వుండేలా అవసరమైన ప్రణాళికలు ముందస్తుగానే సిద్దంగా వుంచుకోవాలని కేంద్ర  బృంద సభ్యురాలు, అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.బాబి పాల్ జిల్లా యంత్రాంగానికి సూచించారు. 
  సోమవారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కేంద్ర బృందం  నుండి వచ్చిన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. బాబి పాల్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్                        డా. నందిని భట్టాచార్య, జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్, అడిషనల్ డి జి ఉజ్వల్ త్రిపాఠి, గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయారావు లతో సమావేశం అయ్యారు.  జిల్లాలో గత మూడు రోజులుగా డా. బాబి పాల్, డా. నందిని భట్టాచార్య క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించిన అంశాలు  కంటైన్మేంట్ క్లస్టర్లు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ -19 ఆసుపత్రులు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అమలు చేస్తున్న ముందస్తు జాగ్రత్త చర్యలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. కంటైన్మేంట్ క్లస్టర్లలో సరుకులు డోర్ డెలివరీ చేయడం మంచి విషయమన్నారు. క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలలో మెరుగైన వసతులతో పాటు, మంచి భోజనం అందిస్తున్నారన్నారు.  హాస్పిటల్  ప్రిపరేషన్ కు సంబంధించి సివియర్ లక్షణాలున్న పాజిటివ్ వ్యక్తులతో పాటు, మైల్డ్, అసలు లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తుల చికిత్స, ఐసోలేషన్ కు సంబంధించి మరిన్ని వార్డులు సిద్దంగా వుంచాలన్నారు.  విద్యా సంస్థలు ప్రారంభించిన తరువాత ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్దులను సైతం 28 రోజుల క్వారంటైన్  తరువాత మాత్రమే  హాస్టల్స్ లోకి అనుమతించేలా  చర్యలు తీసుకోవాలన్నారు.  కంటైన్మేంట్ జోన్ల పరిధి అవకాశం ఉన్నంత వరకు  తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, దీని వలన ఇతర ప్రాంతాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు.   ఆసుపత్రులలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన  అన్ని జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని వారు సూచించారు. 
 ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి,  జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. యాస్మిన్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా అనురాధ  తదితరులు పాల్గొన్నారు.