విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన హృదయ విదారకం :ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్

*విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన హృదయ విదారకం :ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): విశాఖపట్నం ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుండి విషతుల్య వాయువులు విడుదలై 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు శాపంగా మారడం దురదృష్టకరమని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ అన్నారు. విశాఖ దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎల్.జి పాలిమర్స్ ఘటనలో 8 మంది అమాయక ప్రజలు అశువులు బాయడం, వందల మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడం కడు భాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏ.బి.వి.పి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కౌశిక్ ఆకాం క్షించారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. లాక్ డౌన్ నిబంధనలను పరిశ్రమలో ప్రతిరోజూ మెయింటనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన పరిశ్రమలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంచడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో స్టైరెస్ లీక్ జరిగి మంటలు చెలరేగాయన్నారు. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెస్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెంది విపత్కర పరిస్థితులకు దారి తీసిందన్నారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకునే నాధులే కరువయ్యారని కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పట్ల, పర్యావరణం పరిరక్షణ పట్ల భాధ్యతగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అసలు మన రాష్ట్రంలో ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
 పరిశ్రమల నుండి విష రసాయనాలు, వ్యర్ధాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తుండటం అత్యంత హేయనీయమన్నారు. దుర్ఘటనలు జరిగినప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలు ప్రకటించడం, అనంతరం చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉంటున్న పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో వాటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భధ్రతా చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌశిక్ హితువు పలికారు.