కోటం రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసులు అమానుషం :మాజీ యం.యల్.ఏ బొల్లినేని ధ్వజం...

కోటం రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసులు అమానుషం :మాజీ యం.యల్.ఏ బొల్లినేని ధ్వజం...


ఉదయగిరి, మే 17 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): నుడా మాజీ చైర్మన్ కోటం రెడ్డి.శ్రీనివాసులు రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించడం అమానుషమని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని.వెంకట రామారావు ధ్వజమెత్తారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో పేద ప్రజలను ఆదుకునే లక్ష్యాలలో భాగంగా కోటం రెడ్డి.శ్రీనివాసులురెడ్డి తన స్వంత నిధులతో సహాయ సహకారాలు అందిస్తుంటే ఓర్వలేని వై.సి.పి నేతలు అక్రమ కేసులు పెట్టించడం హేయనీయమైన చర్యగా భావిస్తున్నామని ఆదివారం నాడు బొల్లినేని.వెంకటరామారావు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా పేద ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు ముందుకు వస్తున్న టి.డి.పి నేతలను ఇబ్బందులకు గురి చేయడం వై.సి.పి కే చెల్లిందన్నారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారని, వారికి లేని నిబంధనలు తెలుగుదేశం పార్టీ నేతలకు ఆపాదించడంలో ఆంతర్యమేమిటని బొల్లినేని.వెంకటరామారావు వై.సి.పి నేతలను సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేవలం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించామని, కక్ష్య సాధింపు ధోరణులకు దూరంగా ఉన్నామన్నారు. కానీ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టి.డి.పి నేతలను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకోవడం భాధాకరమైన విషయమన్నారు. ఇప్పటికైనా వై.సి.పి నేతలు ప్రత్యర్ధి పార్టీల నేతలపై కక్ష్య పూరిత విధానాలను విడనాడి ఆయా ప్రాంతాలలో అభివృద్ధి పనులు, సమ సమాజ శ్రేయస్సుపై దృష్టిని సారించాలని బొల్లినేని.వెంకట రామారావు హితువు పలికారు.