ఎల్జీ పాలిమర్స్ బాధితులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 09-05-2020,
అమరావతి.


ఎల్జీ పాలిమర్స్ బాధితులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


అమరావతి, మే, 09 ;  విశాఖ గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రజల కష్టాలపై క్షణాల్లో స్పందించే మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎవరికీ ఇబ్బంది కలగదని మంత్రి పేర్కొన్నారు.  మరో 48 గంటలు దాటితే విశాఖలో సాధారణ పరిస్థితులునెలకొంటాయని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ఐదు గ్రామాలలో బాధితులను గుర్తించేందుకు డోర్ టూ డోర్ సర్వే చేస్తామని మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి చక్కబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. ప్రమాదం జరిగిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. 



*రాష్ట్రంలో 1446 మద్యం షాపులను తగ్గించగలిగాం : మంత్రి గౌతమ్ రెడ్డి*


ఆర్థిక లోటు, అదనంగా కరోనా కష్టాలు, ఊహించని విపత్తులు వచ్చినా మద్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934 దుకాణాలకు తగ్గించగలిగామని మంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని ఎన్నికల హామీలలో కాకుండా చేతలలో చూపించగలిగామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  13 శాతం మద్యం దుకాణాలను మూసివేసిందని మంత్రి తెలిపారు. మద్యం ధరలను అత్యధికంగా పెంచి కొనలేని విధంగా, తద్వారా తాగకుండా  చేయడాన్ని దశలవారీగా అమలు చేసే దిశగా  అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ను లిక్కర్ ఫ్రీ (మద్యంలేని) రాష్ట్రంగా మార్చడం ఖాయమని మంత్రి తెలిపారు.



---------------------------