*సచివాలయాలను సందర్శించిన తహసిల్ధారు* వింజమూరు, జూన్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండల కేంద్రంలోని పలు సచివాలయాలను సోమవారం నాడు తహసిల్ధారు యం.వి.కే సుధాకర్ రావు సందర్శించి సచివాలయాల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు సులభతరమైన పాలనను అందించే దిశగా సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా మీ-సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలన్నింటినీ గ్రామ సచివాలయాలకు బదలాయించడం జరిగిందన్నారు. పారదర్శక పాలన దిశగా ఆయా గ్రామాలలోని సచివాలయాల ద్వారానే ప్రభుత్వ సేవలను ప్రజలు స్థానికంగానే పొందే వెసులుబాటు ఉందన్నారు. సచివాలయాల ప్రాధాన్యతను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియపరిచేందుకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అధికశాతం పనులు నేరుగా సచివాలయాల ద్వారానే అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ఒక నిర్ధిష్టమైన వ్యవస్థను రూపొందించిందన్నారు. పాసు పుస్తకాలు, అడంగళ్ళు, కుల, ఆదాయ సర్టిఫికేట్లు తదితరాల మీ-సేవా సర్వీసులన్నింటినీ ప్రజలు ఆయా ప్రాంతాలలోని సచివాలయాల ద్వారానే పొందవచ్చునని తహసిల్ధారు తెలిపారు. గ్రామ రెవిన్యూ కార్యదర్శులు సైతం నిత్యం సచివాలయాలలోనే ప్రజలకు అందుబాటులో ఉండి రెవిన్యూ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరింపజేయాలని ఆదేశించారు. కనుక ప్రజలందరూ కూడా సచివాలయాలలో అందించే సేవల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి ఆయా గ్రామాలలో, ప్రాంతాలలో నెలకొల్పిన సచివాలయాల ద్వారా తమ తమ పనులను పూర్తి చేసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పించిందన్నారు.