*ఉపాధిహామీలో అక్రమార్కులను సస్పెండ్ చేయాలి* ఉపాధిహామీ కూలీల ఆవేదన.... వింజమూరు, జూలై 9 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మేజర్ పంచాయితీ పరిధిలో ఉపాధిహామీ కూలీల కడుపు కొట్టి పబ్బం గడుపుకొంటున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం షాడో ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పాతూరు ఉపాధి కూలీలు గురువారం నాడు యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీకి వినతిపత్రం అందజేశారు. వివరాలలోకి వెళితే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకంలో గతంలో ఫీల్డ్ అసిస్టెంటుగా విధులు నిర్వహించి సస్పెండుకు గురై తిరిగి సీనియర్ మేట్ అవతారమెత్తి మేట్ గా కూడా తొలగింపబడి వేరొక సీనియర్ మేట్ ఇంచార్జ్ అవతారమెత్తి యధేచ్చగా ఉపాధి కూలీల శ్రమను దోచుకుంటూ కాయకష్టం చేసిన కూలీలకు తగిన ఫ్రతిఫలం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంతో పాటు మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఉపాధిహామీ కూలీలు బోరున విలపించారు. పాతూరుకు చెందిన మాలకొండస్వామి, పద్మనాభ గ్రూపుల కూలీలు తమకు వారం రోజులు పనిచేసినా 206 రూపాయలు కూలీ పడుతుందని, తమతో పాటు పనిచేసిన మరొక గ్రూపులకు అదనంగా బిల్లులు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై షాడో సీనియర్ మేట్ ను కూలీ విషయం గురించి అడగ్గా మీరు ఆందోళన చెందవద్దు అని చెబుతూ మరో వారం మస్టర్లు కనిపించలేదని కుంటి సాకులు చెబుతున్నాడని వాపోయారు. ప్రస్తుత కరోనా కాలంలో అసలే కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈయన తతంగంపై సమగ్ర విచారణ జరిపి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ కూలీలు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.