*చంద్రపడియలో దారి మళ్ళిన రైతుల రాయితీ ఎరువులు* అక్రమార్కులకు ఆసరాగా అధికారులు...రంగప్రవేశం చేసిన రాజకీయ దళారులు... వింజమూరు, ఆగష్టు 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే రాయితీ ఎరువులను అక్రమార్కులు దిగమింగేందుకు చేసిన యత్నాలను గ్రామస్థులు చిత్రీకరించిన ఘటన మంగళవారం నాడు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలా ఉన్నాయి. మంగళవారం చంద్రపడియ ప్రధాన రహదారి చెంతనే ఉన్న శ్రీ రజనీ ఫెర్టిలైజర్స్ దుకాణం వెనుక భాగాన ఉన్న గోడౌన్ నందు రైతు భరోసా రధం ద్వారా ఎరువులను దిగుమతి చేస్తున్న నేపధ్యంలో అటుగా వెళుతున్న స్థానికులు అనుమానంతో పసిగట్టి తమ సెల్ ఫోన్లు ద్వారా ఎరువుల దిగుమతులను చిత్రీకరించారు. అనంతరం వారు వ్యవసాయాధికారులకు సమాచారం అందించగా వారు సరిగ్గా స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో తహసిల్ధారు సుధాకర్ రావుకు చరవాణి ద్వారా తెలిపారు. అదే సమయంలో తహసిల్ధారు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు చంద్రపడియ ఫ్యాక్టరీలో ఇటీవల జరిగిన సంఘటనపై పరిశీలనలో ఉన్నారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో తహసిల్ధారు శ్రీ రజినీ ఫెర్టిలైజర్స్ దుకాణం వద్దకు వస్తున్న సమయంలో అప్పటి వరకూ అక్కడే ఉన్న రైతు భరోసా రధాన్ని అక్కడి నుండి ఆఘమేఘాల మీద తరలించారు. అదే క్రమంలో ఆత్మకూరు నుండి వింజమూరు వైపు వస్తున్న మరో రైతు భరోసా రధం వాహనాన్ని నిలుపుదల చేసి చంద్రపడియ ఫ్యాక్టరీ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఒక ఏ.ఆర్ కానిస్టేబుల్ సహాయంతో వింజమూరు పోలీస్ స్టేషన్ కు తరలించాలని, తనకు వీడియో కాన్ ఫరెన్స్ ఉందంటూ స్థానిక వి.ఆర్.ఓ కు తెలిపి అతనిని అక్కడే ఉంచి తహసిల్ధారు యధావిధిగా తన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఆదే అదునుగా చూసుకున్నరో ఏమో కానీ రైతు భరోసా వాహనాన్ని తరలించినట్లు సమాచారం. అయితే ఈ ఏ.ఓ తాను ముందుగానే అక్కడికి వస్తున్నట్లు సంబంధిత ఎరువుల దుకాణం యజమానికి సమాచారం అందించి మార్గమధ్యంలోనే మెక్కారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా స్థాయి వ్యవసాయ, రెవిన్యూ యంత్రాంగం లోతుగా దర్యాప్తు జరిపించిన పక్షంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రానున్నాయని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.