*వింజమూరులో చెరువులను కొల్లగొడుతున్న అక్రమార్కులు* చోద్యం చూస్తున్న అధికారులు.....వింజమూరు, సెప్టెంబర్ 4 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని చెరువులను అక్రమార్కులు యధేచ్చగా గ్రావెల్ రూపంలో కొల్లగొడుతున్నారు. పగలూ రాత్రులు తేడా లేకుండా చెరువులలో జె.సి.బి యంత్రాలు పెట్టి మట్టిని ప్రధాన మార్గాల ద్వారా ట్రాక్టర్ల సాయంతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం చూస్తున్న ప్రజలు సంబంధిత అధికారులు రాత్రులంటే నిద్రపోతూ ఉంటూ తెలియదనుకోవచ్చు, పగలు కూడా నిద్ర పోతూ చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అక్రమార్కులు మట్టి తరలింపుకు నామమాత్రపు అనుమతులు పొంది చెరువులను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నా పట్టించుకునే నాధులు కరువయ్యారు. యర్రబల్లిపాళెం చెరువు, పాతూరు చెరువు, సీతమ్మ కుంటలను తరచూ గ్రావెల్ మాఫియా తమ అడ్డాలుగా మలుచుకుని ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ లక్షలార్జిస్తున్నాయి. చెరువులలో మట్టిని తరలించే సమయంలో పలువురు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా మేము వేరే ప్రాంతంలో విధులలో ఉన్నామని అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతున్నారని పెదవి విరుస్తున్నారు. వింజమూరు విద్య, వైద్యం, వ్యాపార రంగాలో దినదినాభివృద్ధి చెందుతుండటంతో గృహ నిర్మాణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో పల్లపు ప్రదేశాలను చదును చేసేందుకు గ్రావెల్ అవసరమైనందున ఆ సమయంలో ఈ మాఫియా రంగంలోకి దిగి మట్టిని తోలేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. ఈ నేపధ్యంలో సంబంధిత శాఖల అధికారులతో కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగా చెస్ చెల్లించి ఆ తరువాత లెక్కకు మించి చెరువులు, కుంటలు, వాగులు, వంకల నుండి పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఉపయోగించి మెయిన్ రోడ్డు మార్గం ద్వారానే మట్టిని తరలిస్తున్న సంఘటనలు వింజమూరులో పరిపాటిగా మారాయి. ఈ అక్రమ మట్టి తోలకాలను నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు ' కళ్ళు లేని కభోధులు ' గా వ్యవహరించడంలో ఆంతర్యమేమిటని పలువురు ఆయా శాఖల అధికారుల తీరును ఎండగడుతున్నారు. ప్రధానంగా చెరువులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమై మొద్దు నిద్ర పోతూ ప్రభుత్వాదాయానికి గ్రావెల్ మాఫియా గండి కొడుతున్నా ధున్నపోతు మీద వర్షం కురిసిన చందగా ఉన్నారంటే వారు అక్రమార్కుల నుండి ఎంతమేరకు పబ్బం గడుపుకుంటున్నారో ఇట్టే అర్ధమవుతున్నదని ప్రజలు చీ కొడుతున్నారు.