రాజధాని మారుస్తామని సీఎం చెప్పారా? అవన్నీ అపోహలే

రాజధాని మారుస్తామని సీఎం చెప్పారా?
అవన్నీ అపోహలే
స్పీకర్‌ వ్యవస్థపై చర్చ జరగాలి
ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలు
దిల్లీ: దేశవ్యాప్తంగా స్పీకర్‌ వ్యవస్థకు సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత నైతికతను పక్కన పెట్టారని ఆయన ఆక్షేపించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా నేతృత్వంలో పార్లమెంట్‌లో స్పీకర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తమ్మినేని హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న స్పీకర్‌ వ్యవస్థపై సదస్సులో చర్చ జరిగిందని తమ్మినేని చెప్పారు. ఏపీలో గత ప్రభుత్వంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో విలీనం చేసుకోవడం దారుణమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు పార్టీ మారేటప్పుడు నైతిక విలువలను పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలుపొందాలన్నారు. ఉగాండాలో జరగనున్న స్పీకర్ల సదస్సులో చర్చించేందుకు 10 అంశాలను ఎంపిక చేశారని తమ్మినేని చెప్పారు.
ఫర్నిచర్‌ వ్యవహారం దురదృష్టకరం
ఫిరాయింపుల చట్టంపై లోక్‌సభ స్పీకర్ ఒక కమిటీని నియమించనున్నారని ఆయన వివరించారు. స్పీకర్ పరిధిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల ఒప్పందాలు నెరవేరనప్పుడు సమస్యలు వస్తున్నాయని.. అలాంటప్పుడే ప్రజాతీర్పు అపహాస్యం అవుతోందన్నారు. మాజీ స్పీకర్‌ కోడెల ఫర్నిచర్‌ వ్యవహారం దురదృష్టకరమని సీతారామ్‌ అన్నారు. ఇదో మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అది తన పని తాను చేసుకుంటుందన్నారు. ''రాజధాని మారుస్తామని ఎవరు చెప్పారు? సీఎం చెప్పారా?''అని తమ్మినేని ప్రశ్నించారు. శివరామకృష్ణ కమిటీ నివేదికనే మంత్రి బొత్స ఉటంకించారు తప్ప అది ప్రభుత్వ అభిప్రాయం కాదన్నారు. రాజధాని మార్పు అంశంలో జరుగుతున్నవన్నీ అపోహలేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని రైతులనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను కూడా సీఎం సంతృప్తి పరుస్తారని తమ్మినేని చెప్పారు.