తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం

తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం 
ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షులు
వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నందమూరి తారకరామరావు, పి.వి. నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి కొందరు ముఖ్యమంత్రులు తప్ప తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఏ ముఖ్యమంత్రి చొరవ తీసుకోకపోవడం మన దురదృష్టకరం. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతృభాష పట్ల ఉదాసీన వైఖరిని అవలంభించింది.  నాటి పాలకులు కొత్త రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామని, ఇంటర్మీడియట్ స్థాయిలో తప్పనిసరిగా ద్వితీయ భాషగా తెలుగునే చదవాలన్న ఉత్తర్వులు తెస్తామని ప్రకటించుకున్నప్పటీ ఆచరణలో చేసిందేమీ లేదు. నాటి పరిస్డితులను చక్కదిద్దేలా నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటుండటం అభిలషణీయం. ఆ క్రమంలోనే అధికార భాషా సంఘానికి జవసత్వాలు కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసారు. మానవ జీవితంలో తొలుత నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. ఏవరి ప్రమేయం లేకుండా తల్లిని అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. కుటుంబం నుంచే తెలుగు భాష అమలు కావాలి.  మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవలసిందే కాని వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. నిజానికి ఆ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటుంన్నాం.  ప్రాచీన కాలంలోనేగాక, ఆధునిక కాలంలో కూడా తెలుగులో గొప్ప సాహిత్యం వస్తోంది. పల్లె పదం నుంచి జానపదుల సంస్కృతి సంప్రదాయాలు మనకే సొంతం. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదన్నది జగమెరిగిన సత్యం. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలు అన్నా, తెలుగుభాష తీయదనం.. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం అంటూ ఓ సినీకవి కలం ఝళిపించినా... అది నిజం, అదే అక్షర సత్యం. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయిన తరుణంలో  ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణం. ఫలితంగా ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది.  దీంతో ఆంగ్ల భాష నేర్చుకోవటం తప్పని సరి అయ్యింది. ఇది అంగీకారమే,  కానీ  అదే మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. మాతృ భాషకే పరిమితమైన వారి పట్ల ఎగతాళి సరికాదు. సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.  విదేశీయులు సైతం మోజుపడి నేర్చుకుంటున్న తెలుగు భాషను మనం మరుస్తున్నాం. బాషను మరవటం అంటే అమ్మను మరిచిపోవటమే. ప్రపంచంలో 6,600 భాషలు ఉంటే.. అందులో తెలుగు ఒకటి. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించి నాలుగేళ్లయింది. ఈ క్రమంలో అధికార భాషా సంఘం తెలుగు రచయితలను ప్రోత్సహించనుంది. వారు రాసిన పుస్తకాలను ముద్రించి సమాజానికి అందించటమే కాకుండా  విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచుతూ, పాఠశాలల్లో, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధన తీసుకువస్తాం.


 తెలుగు కావ్యాలలోని నాటి సామాజిక కూర్పును నేటి సమాజానికి చాటి చెప్పాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఈ నేపధ్యంలో తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్యగ్రంధాలలో ప్రవేశ పెట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటాం. జానపదాలు, జానపద కళాకారులపై విస్తృత ప్రచారం చేస్తూ తెలుగు సాహిత్యంలో పరిశోధనలను ప్రోత్సహించాలన్నదే అధికార భాషా సంఘం ఆలోచన. ఎన్ టి ఆర్ మానస పుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను పూర్తి స్ధాయిలో తరలించటం ద్వారా దానిని సాకారం చేస్తాం.  ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు. పరభాషను గౌరవించు.. మాతృభాషను ప్రపంచానికి చాటిచెప్పు అన్న రీతిగా మనందరం వ్యవహరించాలి.  అప్పడే అమ్మ భాష మనతో ఉంటుంది.  రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక కేంద్రం గానే గాకుండా భాషా సాంస్కృతిక కూడలిగా రాజధానిని నిర్మించే దిశగా అడుగులు వేయాలన్నది భాషాభిమానుల ఆలోచన. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాము.  తెలుగు ప్రముఖులు నివాసాలను దర్శనీయ స్ధలాలుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించాం. ప్రభుత్వ పరమైన లేఖలు తెలుగులో సాగేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయించాలన్నది అధికార భాషా సంఘం ఆలోచన. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలుగు భాషపై ఉన్న ప్రేమానురాగాలను మేము సద్వినియోగం చేసుకుంటాం. ఇందుకు ప్రతి తెలుగు వారి సహకారం కోరుతున్నాం. (29 ఆగస్టు 2019 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)