యూనియన్ బ్యాంకునే ఆంధ్రా బ్యాంకులో కలపండి :


న్యూఢిల్లీ : బ్యాంకుల విలీనంలో భాగంగా 96 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఖండించారు. కావాలంటే యూనియన్ బ్యాంకునే ఆంధ్రా బ్యాంకులో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు వాళ్లకు ఉన్న ఒకేఒక్క సొంత బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ అని, అది తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలకు సంబంధించినదని, కేంద్రం తీసుకున్న విలీనం చర్య తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమ నేత భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన బ్యాంకును వేరే బ్యాంకులతో కలపొద్దని ఆయన కోరారు. తెలుగు వారి మనోభావాలకు అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించుకోవాలని బాలశౌరి సూచించారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో విలీనం చేయాల్సి వస్తే విలీనమైన బ్యాంకుకు 'ఆంధ్రా బ్యాంకు'గానే నామకరణం చేయాలని ఎంపీ ప్రతిపాదించారు. అంతేకాకుండా ఆ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ ఏపీలోనే ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బ్యాంకింగ్ సెక్రెటరీలను కలుస్తానని ఎంపీ బాలశౌరి తెలిపారు.