దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌


అక్టోబరు 8, 9 తేదీల్లో ఇప్పటికే వెయిటింగ్‌ లిస్టు
ఆ రెండు రోజుల్లో ప్రత్యేక రైళ్లు అవసరం
జనసాధారణ రైళ్లనైనా నడపాలని ప్రయాణికుల విజ్ఞప్తి
గుంటూరు : మరో మూడు వారాల్లో దసరా నవరాత్రుల సెలవుదినాలు ప్రారంభం కానుండటంతో రైళ్లలో రద్దీ అప్పుడే మొదలైంది. ముఖ్యంగా సెలవులు అయిపోయి తిరిగి వెళ్లే రోజులైన అక్టోబరు 8, 9 తేదీల్లో టిక్కెట్‌లన్ని బుకింగ్‌ అయిపోయాయి. కొన్ని రైళ్లలో అయితే వెయిలింగ్‌ లిస్టు 100కి పైగా ఉందంటే చాలామంది అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసేసుకొన్నారు. పండగకి సెలవులు దొరకుతాయో, లేదోనన్న మీమాంసలో ఉన్నవారు మాత్రం తత్కాల్‌ కోటా టిక్కెట్‌లు, ప్రత్యేక రైళ్ల పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకొంటున్నారు. ఇప్పటికే గుంటూరు రైల్వే డివిజన్‌ మీదగా పలు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రద్దీ మరింత అధికంగా ఉంటే జనసాదారణ రైళ్లని నడపాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వేని కోరే ఆలోచనలో అధికారవర్గాలు ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ నుంచే దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆలోపే పాఠశాలల్లో పిల్లలకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించి సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నాయి. దసరాని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిర్వహిస్తారు. దాంతో పండగని స్వస్థలాల్లో ఘనంగా జరుపుకొనేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రల నుంచి వచ్చి వెళ్లడం సాధారణంగానే జరుగుతుంటుంది. రోడ్డు రవాణ కంటే రైలు ప్రయాణం సురక్షితం కావడంతో తొలి ప్రాధాన్యం ఎక్కువగా దీనికే ఇస్తారు. అందులోనూ రెగ్యులర్‌ రైళ్లలో టిక్కెట్‌లు దొరికితే చాలని భావిస్తారు. చాలామంది ముందుచూపుతో వ్యవహరించి రెండు, మూడు నెలలు ముందుగానే టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్నారు. ఈ కారణంగానే అక్టోబరు 8, 9 తేదీల్లో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ వంటి రైలులో సెకండ్‌ సిట్టింగ్‌ టిక్కెట్లకు కూడా వెయిటింగ్‌ లిస్టు కొనసాగుతోంది. ఇక నరసపూర్‌, డెల్టా, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో సికింద్రాబాద్‌ వైపునకు టిక్కెట్‌లు రిజర్వు అయిపోయాయి. నంద్యాల మార్గం వైపున రైళ్లలోనూ రద్దీ నెలకొన్నది. సంక్రాంతి, వేసవి సెలవుల్లో నడిపిన జనసాదారణ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నవరాత్రుల సెలవుదినాల్లో రద్దీ ఎక్కువగా ఏ తేదీల్లో ఉందో గుర్తించి ఆయా రోజుల్లో జనసాదారణ రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.