తేదీ : 06-09-2019,
అమరావతి.
• సంక్షేమంతో సమానంగా పారిశ్రామికాభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ధృఢనిశ్చయం : మంత్రి మేకపాటి
• ప్రతి జిల్లాలో పారిశ్రామిక ఏర్పాటు దిశగా అడుగులు
• ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
• పరిశ్రమల ఆకర్షణకు పారదర్శకమైన కొత్త పాలసీ విధానం
• సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపైనా చర్చ
అమరావతి, సెప్టెంబర్, 6 ; పారదర్శకమైన కొత్త పాలసీ తయారే లక్ష్యంగా పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభించింది. పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, జోనల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికి..శాలువా కప్పి చిరు సత్కారం చేశారు. పాలసీ విధానాలను పారదర్శకతే ధ్యేయంగా రూపొందించాలని, పాలసీ విడుదల కాగానే రాష్ట్రానికి పరిశ్రమలు పరుగులు పెట్టాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమంతో సమానంగా పారిశ్రామికాభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి ..అధికారులకు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...పారిశ్రామిక పాలసీ విధానం 2020 – 25 పై 4,5 బృందాలుగా ఏర్పడి అధికారులు చర్చించారు. భూ కేటాయింపులపై కూడా కొత్త పాలసీ రూపొందించే దిశగా అడుగులు వేయాలని అందుకు అవసరమమైన సూచనలు ఇచ్చారు.
ఒక ప్రాంతమో, ఒక జిల్లాకో పరిశ్రమల ఏర్పాటుకు పరిమితం కాకుండా ప్రతి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు మంత్రి. పార్కుల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలుండేలా అభివృద్ధి జరగాలన్నారు. పెట్టుబడిదారులకు నీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల వంటి సదుపాయాలన్ని కల్పిస్తే పరిశ్రమలు వాటంతటా అవే వస్తాయన్నారు. పరిశ్రమలు ఏర్పటవడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంచేలా ఉండాలన్నారు. లోక్ సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రి ఏకరువు పెట్టారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదాయం పెరిగేలా చూసుకోవడం అనివార్యమన్నారు. గత ప్రభుత్వంలో వలె లోపభూయిష్ట ఒప్పందాలు లేకుండా..ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే పాలసీ అందించి.. మీ పనితీరుతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందే ఏ పరిశ్రమలకు ఏఏ నైపుణ్య శిక్షణ అవసరమో తెలుసుకుని వాటిని యువతీ, యువకులకు ప్రభుత్వమే ఉచితంగా నేర్పించేందుకు కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖలో ప్రమోషన్ల గురించి అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఏపీఐఐసీ ఎండీ ఎం. ప్రతాప్ రెడ్డి, ఈడీ హరినారాయణ్, జోనల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.