తేదీ : 24-09-2019,
బెంగళూరు.
*పెట్టుబడులే లక్ష్యంగా బెంగళూరులో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన*
• బెంగళూరులో బిజినెస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా వివిధ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో మంత్రి చర్చలు
• పెట్టుబడులు ఆకర్షించే ఐ.టీ, ఇండస్ట్రీ పాలసీ విధానాలకు కసరత్తు
• విశాఖపట్నం,అనంతపురం కేంద్రంగా భవిష్యత్ లో ఐ.టీ పారిశ్రామికాభివృద్ధి
బెంగళూరు, సెప్టెంబర్ 24 : పెట్టుబడులను ఆకర్షించే పారదర్శక ఐ.టీ, పారిశ్రామిక విధానాల రూపకల్పనకోసం పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. బెంగళూరులోని కాన్రాడ్ హోటల్ లో నిర్వహించిన 'బిజినెస్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్'లో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి వారికి స్పష్టం చేశారు. నవరత్నాల అమలు, అవినీతి రహిత పాలన, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తూ కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంగళవారం వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఏపీలో వాణిజ్య విస్తరణ దిశగా ఐటీ దిగ్గజం టీసీఎస్ సంస్థ ప్రతినిధులు సునీల్ దేశ్ పాండే, నీత మంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని సానుకూలతలు, పెట్టుబడుల అవకాశాలను బట్టి మరిన్ని పెట్టుబడులు ఏపీలో పెట్టాలని , వ్యాపారాన్ని విస్తరించవలసిందిగా మంత్రి మేకపాటి టీసీఎస్ ప్రతినిధులను కోరారు.
సుపరిపాలన, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన సాగుతుండడంతో ఏపీవైపు పారిశ్రామికవేత్తల చూపు మళ్లిందని సంస్థల ప్రతినిధులతో మంత్రి అన్నారు . ప్రపంచమంతటా అన్ని సంస్థలు, రంగాలలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన 3 నెలలోనే 5 లక్షల మందికి ఉద్యోగాలివ్వడం ముఖ్యమంత్రి జగన్ నాయకత్వపటిమకు నిదర్శనమన్నారు. ఏపీలో అనంతపురం, విశాఖపట్నం కేంద్రంగా భవిష్యత్ లో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి తెలిపారు. అనంతరం అక్టోబజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరిపారు. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు గల ఇండస్ట్రి, ఐ.టీ పాలసీ ప్రతిపాదనలపై పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ కూపర్స్) సంస్థ ప్రతినిధులు రాకేశ్, శ్రీరామ్ లతో మంత్రి మేకపాటి చర్చించారు. సౌకర్యాలు, సేవలందించే పేరున్న హోటల్ 'హిల్టన్' ప్రతినిధి మంత్రితో సమావేశమయ్యారు. ఏపీలో హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను, ఆంధ్రప్రదేశ్ విశిష్ఠతను మంత్రి వివరించారు. కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధి మంత్రితో అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో విశ్వ అపెరల్ గార్మెంట్ ఎక్స్ పోర్టర్ సంస్థ ప్రతినిధులు మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. ఎగుమతులు, వాణిజ్యం తదితర అంశాలపై ఆ సంస్థ ప్రతినిధి మైథిలి మంత్రితో చర్చించారు.
మైై