*జిల్లాకు అవసరమైన బియ్యం 13,243 మెట్రిక్ టన్నులు
*ఇప్పటివరకు వచ్చింది 6,200 టన్నులే శ్రీకాకుళం జిల్లాలో తెల్ల రేషన్‌కార్డుదారులకు నేటి నుంచి చేపట్టనున్న నాణ్యమైన బియ్యం పంపిణీ వాయిదా పడింది. జిల్లాకు రావాల్సినంత బియ్యం రాకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో సెప్టెంబర్ నెలకు 8,14,264 కార్డులకు సంబంధించి 22,76,523 మందికి బియ్యం అందించాల్సి ఉంది. వీరందరికీ బియ్యం అందించాలంటే 13,243 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు గుర్తించారు. శనివారం నాటికి 6,200 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వచ్చాయి. నాణ్యమైన బియ్యం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం రప్పిస్తున్నారు. మిల్లర్లతో చర్చల్లో జాప్యం, పెద్దఎత్తున ధాన్యం మర ఆడించాల్సి రావడంతో కొంత ఆలస్యమైంది. బియ్యాన్ని నాలుగు రకాల సంచుల్లో నింపి జిల్లాకు పంపుతున్నారు. 5, 10, 15, 20 కేజీలకు విడివిడిగా ప్యాకెట్ల రూపంలో జిల్లాకు పంపిస్తున్నారు. ఐదు కేజీల ప్యాకెట్లు 1,15,491 అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ 47,852 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. పది కేజీల ప్యాకెట్లు 2,38,697 అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాకు 89,215 చేరాయి. 15 కేజీల ప్యాకెట్లు 2,70,555 పంపిణీ చేయాల్సి ఉండగా 1,16,004 ప్యాకెట్లు వచ్చాయి. అదేవిధంగా 20 కేజీల ప్యాకెట్లు 3,04,385 అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,66,912 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. తూర్పుగోదావరి బియ్యం ఆలస్యంగా వస్తుండడంతో పాటు జిల్లాలోని బియ్యం నిల్వ కేంద్రాల (ఎంఎల్‌ఎస్)కు, అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లడంలోనూ కొంత జాప్యమవుతోంది. జిల్లాలో 2015 రేషన్ దుకాణాలుండగా, ఇప్పటివరకు 530 దుకాణాలకు మాత్రమే బియ్యం చేరాయి. పంపిణీపై చివరి వరకూ ఉత్కంఠ : నాణ్యమైన బియ్యం పంపిణీలో చివరి వరకూ ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో వీటి బాధ్యతను చూస్తున్న తహశీల్దార్లకు శుక్రవారం రాత్రి వరకూ సమాచారం ఇవ్వలేదు. దీంతో గ్రామాల్లో బియ్యం పంపిణీకి మండలానికి 150 నుంచి 200 వరకూ ఆటోలు, ఇతర లగేజీ వాహనాల యజమానులతో మాట్లాడి సిద్ధం చేశారు. శనివారం ఉదయం పంపిణీ వాయిదా పడిందని తెలియడంతో, యజమానులకు వాహనాలు వద్దని చెప్పాల్సి వచ్చింది.
6న పంపిణీ : నాణ్యమైన బియ్యం పంపిణీ ఈనెల ఆరో తేదీన జిల్లాలో ప్రారంభం కానుంది. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపనకు రానున్నారు. అప్పటికి పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం వచ్చే అవకాశం ఉండడంతో, అదే రోజు పంపిణీ చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది.
బియ్యం రప్పించేందుకు చర్యలు : నాణ్యమైన బియ్యం పంపిణీ ఈనెల ఆరో తేదీన ప్రారంభం కానుంది. జిల్లా అవసరాల మేరకు బియ్యం రప్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం వచ్చేస్తాయి. జిల్లాకు వచ్చిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు రేషన్ డిపోలకు పంపిస్తున్నాం.
ఆరో తేదీకి సన్నబియ్యం పంపిణీ వాయిదా