అంతిమ తీర్పు. నెల్లూరు జిల్లా. శ్రీసిటీ 14. 9. 2019
శ్రీసిటీ బాల్ కార్పొరేషన్ పరిశ్రమచే విద్యార్థులకు ఎక్స్‌పోజర్ విజిట్
- పరిశ్రమ సందర్శించిన ఇరుగుళం జెడ్‌పి హైస్కూల్ టెన్త్ విద్యార్థులు
శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో శ్రీసిటీలోని బాల్ కార్పొరేషన్ పరిశ్రమ యాజమాన్యం శుక్రవారం మధ్యాహ్నం ఇరుగుళంలోని జెడ్‌పి హైస్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించింది.
ఇందులో భాగంగా విద్యార్థులను పరిశ్రమలోని తయారీ ప్లాంట్ కు తీసుకెళ్లి, అక్కడ ఉత్పత్తి చేసే అల్యూమినియం శీతల పానీయాల డబ్బాల తయారీ గురించి వివరించారు. డబ్బాల తయారీ అనంతరం వాటిని ఫోర్క్ లిఫ్ట్ వాహనాల ద్వారా తరలించడం, పాలెట్లలో నింపడం, ఆపై కస్టమర్ సంస్థలకు డెలివరీ చేయడం వంటి వివిధ స్థాయిల గురించి వారికి అవగాహన కల్పించారు. హైస్కూల్ సైన్స్ టీచర్లతో కలిసి విద్యార్థులు ఈ సందర్శన సాగించారు.
కంపెనీ హెచ్ఆర్ హెడ్ రత్నావెల్ రాజన్ ఈ తయారీ ప్రక్రియ గురించి వివరించారు. డబ్బాల తయారీకి అల్యూమినియం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియ చేశారు. ప్లాస్టిక్ వంటి ఇతర పదార్థాలతో పోలిస్తే అల్యూమినియం పర్యావరణానికి ఎంతో మంచిదన్న అంశాన్ని హైలైట్ చేశారు. కంపెనీకి చెందిన మరో అధికారి 'కెరీర్ మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి' అనే అంశంపై విద్యార్థులకు ఈ సందర్భంగా ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం పరిశ్రమ ఆవరణలో క్విజ్ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పరిశ్రమను నేరుగా సందర్శించడం, పలు అంశాలు తెలుసుకోవడం తమకెంతో ఆనందంగా వుందంటూ విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కాగా, బాల్ కార్పొరేషన్ పరిశ్రమ యాజమాన్యం గత సంవత్సరం కూడా ఇదే తరహాలో మండలంలోని మాదనపాలెం జెడ్‌పి హైస్కూల్ 10 వ తరగతి విద్యార్థుల కోసం ఇలాంటి సందర్శన కార్యక్రమం నిర్వహించింది.