దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ : 10-09-2019, 
నెల్లూరు జిల్లా.


*దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం : పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


•  సోమశిల హైలెవల్  కెనాల్  ఫేజ్-2 పనులు త్వరలోనే పూర్తి చేస్తాం..
•  చంద్రబాబు హయాంలో వాన రాదు..నీరు లేదు : మేకపాటి గౌతమ్ రెడ్డి
•  జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉండడం లక్కీ హ్యాండ్ : మేకపాటి గౌతమ్ రెడ్డి
•  ఆత్మకూరు ప్రజలకు నీరిచ్చినప్పుడే నా గెలుపుకు, పదవికి సార్థకత : మంత్రి మేకపాటి
•  ఈ సంవత్సరం ఆఖరులోగా కడప ఉక్కు కర్మాగారం స్థాపిస్తాం
•  ప్రభుత్వ శ్వేతపత్రంపై ఇప్పటివరకూ ప్రతిపక్షం ఆధారాలతో నిరూపించలేదు
•   పారిశ్రామిక అభివృద్ధి నిజమని టీడీపీ రుజువు చేయలేకపోయింది


నెల్లూరు, సెప్టెంబర్, 10 ; ముఖ్యమంత్రిగా జగన్ రాగానే ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో నీటి పరవళ్ళు ఖాయమన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సోమశిల  ప్రాజెక్టు నుంచి కండలేరుకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో  మంత్రి మేకపాటి పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా నెల్లూరు జిల్లాకు చెందిన  ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పాల్గొన్న ఈ నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులన్నీ జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు హయాంలో వర్షం కురవక, నీళ్లు లేని పరిస్థితిని చూశామని అన్నారు. జలవనరుల శాఖ మంత్రే మన జిల్లాకు చెందిన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అవడం మనకు లక్కీ హ్యాండ్ అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పూర్తయితే జిల్లాకు మరింత మంచి జరుగుతుందని, రాయలసీమ, మెట్ట ప్రాంతాలతో సహా రాష్ట్రమంతటా తాగు, సాగు నీరుకు లోటు ఉండదని మంత్రి మేకపాటి తెలిపారు. తమ కుటుంబం ముందు కలువాయి మండలంతోనే అనుబంధం ఉండేదని, అనంతరం మెట్ట ప్రాంతాలైన అనంతసాగరం, ఉదయగిరి, మర్రిపాడు మండలాల ప్రజలతో ప్రత్యేక బంధం ఏర్పడిందని మంత్రి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతాలు తన తండ్రిగారైన మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, చిన్నాన్న, ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి చెందాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదన్నారు మంత్రి. నెల్లూరు జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  తన పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే రెండు సార్లు శ్రీశైలం నిండి సోమశిలకు నీరు చేరడం నిజంగా ఆయనది లక్కీ హ్యాండ్ అని అభిప్రాయపడ్డారు. ఆ లక్కీ హ్యాండ్ తోనే  సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-1, ఫేజ్ -2 పనులు పూర్తి చేసి ప్రారంభించాలని మంత్రి మేకపాటి కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో   ఈ విషయంపై చర్చించానని, అందుకు ముఖ్యమంత్రి ఫేజ్ -2 పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని తనతో చెప్పిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందించే అన్ని ప్రాజెక్టులు ఐదేళ్లలో పూర్తవుతాయని మంత్రి అన్నారు. గతంలో ఎన్నో సార్లు సోమశిల ప్రాజెక్టును పరిశీలించినపుడు ఎప్పుడు ఇంకిపోయేదని, కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లపాటూ ప్రాజెక్టులు గేట్లు ఎక్కిపారడమే ఉంటుందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు తాను మాట ఇచ్చినట్లే చివరి ఆయకట్టుకు నీరందించినప్పుడే తాను ఎమ్మెల్యేగా గెలిచినందుకు, మంత్రి పదవి చేపట్టినందుకు ఒక సార్ధకతగా భావిస్తానని మంత్రి మేకపాటి పునరుద్ఘాటించారు. ఇరువురు మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన జిల్లా,  మండల స్థాయి నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో  తరలిరావడంతో సోమశిల ప్రాజెక్టు సమీపంలో పండుగ వాతావరణం నెలకొంది.


సోమశిల నుంచి కండలేరుకు నీటి విడుదల కార్యక్రమం అనంతరం అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 5 లక్షలకు పైగా యువతకు ఉద్యోగాలించిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న సంక్షోభ సమయంలో మన రాష్ట్రంలో మాత్రం ఆ స్థాయి ఉద్యోగాల కల్పన జరగడం ముఖ్యమంత్రి జగన్ అంకితభావం వల్లే సాధ్యమైందన్నారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా, యువతకు ఇబ్బందులు కలగకుండా సచివాలయం పరీక్షలను పకడ్బంధీగా వారం రోజుల పాటు నిర్వహించిన  జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారన్నారు. అధికారుల కృషి, వారి సమన్వయం వల్లే ఇది సాధ్యపడిందన్నారు మంత్రి. గత ప్రభుత్వం పనితీరు, పరిశ్రమల శాఖలో జరిగిన అవకతవకలను ప్రజల ముందుంచడానికి ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం విడుదల చేశాం. కానీ, ఆ శ్వేత పత్రంపై అర్థం లేని మాటలు, కప్పిపుచ్చుకునే ధోరణితో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారే తప్ప, రుజువు చూపలేకపోయారని మంత్రి ఆరోపించారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్నపుడు తనతో పాటు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారితో జరిగిన సంభాషణను మంత్రి మీడియా ముందు వివరించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని అడగాలని వెళ్లినపుడు ఓ కాగితం చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండగా హోదాతో పనేముందని ప్రశ్నించినట్లు ఆ అధికారి చెప్పారన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారాలు, లక్షల కోట్ల పెట్టుబడులంటూ అబద్ధాలు చెప్పడం వల్ల చాలా నష్టం జరిగిందని చర్చిచారన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఆ విషయంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాల వల్ల కేంద్ర ప్రభుత్వం సాయం చేయదని జగన్ సూచనలు చేసినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. కియాకు ఇచ్చిన పాలసీని మేం వ్యతిరేకిస్తే కియాకు వ్యతిరేకమనే ప్రచారం చేశారని మంత్రి ఆరోపించారు. త్వరలోనే నవ్యాంధ్రకు పరిశ్రమలు తరలి వచ్చేలా పాలసీని తీసుకురానున్నామని మంత్రి తెలిపారు.  గత ప్రభుత్వపు దొంగ ఎంవోయూల వలె కాకుండా నిజాయతీగా పెట్టుబడిదారులను రప్పిస్తామన్నారు. 2020లో రిలయన్స్ సంస్థ కమర్షియల్ గ్యాస్ ప్రాడక్ట్స్ కు సంబంధించిన వ్యాపారంలోకి దిగబోతున్నారన్నారు. ఈ నెల 13న నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ తో జరగనున్న సమావేశంలో రిలయన్స్ గ్యాస్ ప్రాడక్ట్స్ లో మన రాష్ట్రానికి తప్పనిసరిగా వాటా ఇవ్వాలని కోరతామని మంత్రి అన్నారు. గతంలో గ్యాస్ లేక కొన్ని పరిశ్రమలు వెళ్లిపోయాయని, అవి జరగకుండా ఇపుడు చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కలంగా గ్యాస్ నిక్షేపాలు, మిగులు విద్యుత్ వంటి చర్యల వల్ల త్వరలో కరెంట్ రేటు కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదన్నారు. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయన్నారు. అందుకే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేక కోటా కావాలని కోరతామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా త్వరలోనే 2025 వరకూ చేపట్టవలసిన ప్రాజెక్టుల వంటి వివరాలను ప్రాధాన్యత క్రమంలో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అందుకు తగ్గ విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి వివరించారు. డిసెంబర్ 26 లోపు కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం స్థాపిస్తుందన్నారు మంత్రి మేకపాటి. పారిశ్రామిక విధానం మెరుగుపడాలంటే పాలసీ విధానం ముఖ్యమన్నారు. ఓపెన్ ట్రాన్పరెంట్ పాలసీయే ఎజెండాగా అందరికీ ఆమోదయోగ్యమైన, సమ ప్రాధాన్యతనిచ్చే విధానాలకు పెద్దపీట వేసి పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరుస్తామని మంత్రి అన్నారు.