సమాజంలో సేవాతత్పరతకు దిక్సూచి రెడ్ క్రాస్:గవర్నర్

సమాజంలో సేవాతత్పరతకు దిక్సూచి రెడ్ క్రాస్


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్


అవార్డులు అందుకున్న పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు


విజయవాడ సెప్టెంబర్ 30 (అంతిమ తీర్పు);


రెడ్ క్రాస్ సొసైటీ సమాజంలో సేవతత్పరతను ప్రేరేపిస్తూ ఒక దిక్సూచిగా పనిచేయటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, సొసైటీ అధ్యక్షులు భిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. విభిన్న విభాగాలలో రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు మరెందరికో స్పూర్తిదాయకంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రత్యేకించి రక్త సేకరణ, పంపిణీలో రెడ్ క్రాస్ నుండి అందుతున్న సేవల ఫలితంగా ఎందరినో ప్రాణాపాయం నుండి కాపాడగలిగారని ప్రస్తుతించారు. రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం, అవార్డుల పంపిణీ విజయవాడలో సోమవారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిశ్వ భూషన్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా రక్తాన్నిదానం చేయటం  మంచి పరిణామమని , విద్యార్ధులు, యువతలో సేవ భావం పెంపొందించేలా రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీలో మరింత మంది యువతను భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.


కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారులు పలువురు గవర్నర్ చేతుల మీదుగా  అవార్డులు అందుకున్నారు. ఎంటి కృష్ణబాబు, ధనుంజయ రెడ్డి, హరి జవహర్ లాల్, ఎస్ సత్యన్నారాయణ, బసంత్ కుమార్, వివేక్ యాదవ్, కార్తకేయ మిశ్రా, ఇంతియాజ్ అహ్మద్, వి.ప్రసన్న వెంకటేష్ తదితరులు బంగారు పతకాలు, అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రశాఖ ఛైర్ పర్సన్ రేచల్ ఛటర్జీ, ఉపాధ్యక్షుడు ఎస్ బాలసుబ్రమణ్యం, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు. తొలుత రెడ్ క్రాస్ సొసైటీ గత సంవత్సరంలో అందించిన సేవల వివరాలను రేచల్ ఛటర్జీ సమవేశం దృష్టికి తీసుకువచ్చారు. సేవతత్పరత కనబరిచిన పలువురు చిన్నారులకు కూడా గవర్నర్ ఈ సందర్భంగా బహుమతులు అందచేసారు. వారితో ఛాయా చిత్రాలు దిగి ఉత్సాహం  నింపారు.