జూనియర్ లాయర్లకు నెలకు రూ.5 వేలు
కొత్తగా లా చదివిన వారికి తొలి మూడేళ్ల పాటు సాయం
అమరావతి : మరో ఎన్నికల హామీ అమలుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జూనియర్ లాయర్ల (అడ్వకేట్)కు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్సార్ లా నేస్తం' పథకం అమలుకు ఉత్తర్వులిచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. 'వైఎస్సార్ లా నేస్తం' ప్రకారం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు.. అంటే మూడేళ్ల పాటు నెలకు రూ.5000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన ఈ పథకం ప్రారంభం కానుంది.
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు..
దరఖాస్తు దారు లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్‌లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు.
15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్‌ను సమర్పించాలి.
న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్‌లో ఉంచాలి.
కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు.
కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు.
ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు
జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు
నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు
అర్హులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి.
దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి.
జూనియర్ లాయర్లకు నెలకు రూ.5 వేలు