వింజమూరులో సమ్మె కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

*వింజమూరులో సమ్మె కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు* వింజమూరు: పెండింగ్ లో ఉన్న పాత బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద పంచాయితీ కాంట్రాక్టు కార్మికులు 3 వ రోజు కూడా సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ చేత పంచాయితీ పారిశుధ్యం విషయంలో గొడ్డు చాకిరీ చేయించుకున్న అధికారులు జీతాలు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతూ తమ చేత పనులు చేయించుకున్నారన్నారు. మొదటి నెల జీతం రెండవ నెల జీతాలు ఒకేసారి ఇస్తామంటూ 5 నెలలు ఇదే మాటలతో కాలం వెల్లబుచ్చారని కార్మికులు భోరుమన్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ఇలా ఎన్ని రోజులు గడపాలని వారు సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు. మీరైతే ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు తీసుకుంటూ తమ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. పొద్దున నిద్ర లేచి వీధులలో దుర్గంధం వెదజల్లుతున్న చెత్తా చెదారమును తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పారిశుధ్య పనులు చేపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమకు జీతాలు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు వేడుకుంటున్నారు..